నవతెలంగాణ-హైదరాబాద్: H-1B వీసా ప్రోగ్రాంను “మోసం”గా అభివర్ణించారు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లూట్నిక్. ఈ వీసాల కారణంగా అమెరికన్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. దీంతో పాటు వీసా వ్యవస్థలో సంస్కరణలు చేసేందుకు సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం H-1B వీసా దారుల్లో అధిక శాతం భారతీయులే ఉండటం వల్ల ఈ మార్పులతో అనేక మందిపై తీవ్ర ప్రభావం చూపేంచే అవకాశం ఉంది.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లూట్నిక్ మాట్లాడుతూ.. ప్రస్తుత H-1B వీసా వ్యవస్థ ఒక ఫ్రాడ్.. ఇది అమెరికన్ ఉద్యోగాలను పక్కన పెట్టి విదేశీయులతో భర్తీ చేస్తోంది అన్నారు. ప్రతి అమెరికన్ కంపెనీకి మన దేశ కార్మికులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అలాగే, ప్రస్తుత లాటరీ విధానం స్థానంలో వేతన ఆధారిత (wage-based) విధానాన్ని ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నామని వెల్లడించారు.
H-1B వీసా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేసినా మొదట అత్యధికంగా ప్రభావితమయ్యే దేశం భారతే.. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన H-1B వీసాలలో 72 శాతం కంటే ఎక్కువ భారతీయులకే లభించాయి. చైనా వాటా కేవలం 11.7 శాతం మాత్రమే అని చెప్పాలి. ప్రస్తుతం H-1B వీసా కోటా 65,000 ఉండగా, అదనంగా 20,000 వీసాలు యూఎస్ లో ఉన్న అడ్వాన్స్‌డ్ డిగ్రీ హోల్డర్లకు కేటాయిస్తున్నారు. ఇవన్నీ లాటరీ పద్ధతిలోనే కేటాయించబడుతున్నాయి.