నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ దేశ రాజధాని ఢాకాలో ఇంక్విలాబ్ మంచో సంస్థ కన్వీనర్ షరిప్ ఉస్మాన్ బిన్ హాదీ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కుటుంబ సభ్యుల కోరిక మేరకు, హాదిని జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కన ఖననం చేశారు. తెల్లవారుజాము నుండే, మానిక్ మియా అవెన్యూ వద్దకు మద్దతుదారులు గుంపులు గుంపులుగా చేరుకున్నారు. త్వరలోనే పార్లమెంట్ ముందు ఉన్న రహదారి ప్రజలతో నిండిపోయింది.
హాదీ అంతియాత్రకు భారీగా జనం హాజరైయ్యారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను చూతబూని, హాది హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలను సగం ఎత్తులో ఎగురవేసి, ప్రార్థనా స్థలాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హాదీ మరణాంతరం ఆ దేశ రాజధాని ఢాకాలో నిరసన జ్వాలాలు మిన్నంటాయి. ఇంకిలాబ్ మోంచో మద్దతుదారులు పెను ధ్వంసం సృష్టించారు. రెండు రోజుల నిరసనల తర్వాత ఢాకాలో సాపేక్షంగా ప్రశాంతమైన రోజు నెలకొంది.
కాగా, డిసెంబర్ 12న రాజధానిలో బిజూనాయర్ సమీపంలో ఓ ప్రచారం ముగించుకొని ఆటో రిక్షాలో బయలుదేరుతుండగా..పలువురు దుండగలు వచ్చి హాదీపై కాల్పులు జరిపారు. తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 15న సింగపూర్‌కు తరలించినా హాదీ మృతి చెందారు. దీంతో ఆయన మృతితో ఒక్కసారిగా బంగ్లాదేశ్‌లో అలజడి చెలరేగింది. ఆందోళనకారులు పలు పత్రిక సంస్థలతో పాటు ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అదే విధంగా మైనార్టీ వర్గాలపై అల్లరి మూక దాడులు చేసింది.



