నవతెలంగాణ-హైదరాబాద్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ తీర్థయాత్ర త్వరలో ప్రారంభకానుంది. యాత్రలో భాగంగా సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న మస్జిద్ అల్-హరామ్ (పవిత్ర మసీదు) చేరుకొనున్నారు. హజ్ ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 12వ నెల ధుల్ హిజ్జా లో నిర్వహించబడుతుంది. ధుల్ హిజ్జా 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే ఈ పవిత్ర యాత్రలో లక్షలాది ముస్లింలు పాల్గొంటారు. హజ్ లో భాగంగా ముస్లింలు ‘కాబా’ చుట్టూ తవాఫ్ చేయడం, సఫా-మర్వా కొండల మధ్య నడవడం, మినా, అరాఫాత్, ముజ్దలిఫాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం వంటి ఆత్యాద్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్ర జూన్ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. సౌదీ హజ్ మంత్రి తౌఫిక్ అల్-రబియా సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇప్పటికే విశ్వవ్యాప్తంగా నుండి ఒక మిలియనుకు పైగా యాత్రికులు సౌదీకి చేరుకున్నట్లు తెలిపారు. గత ఏడాది మొత్తం 1.8 మిలియన్ ముస్లింలు హజ్ యాత్రలో పాల్గొన్నారని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి.