నవతెలంగాణ-హైదరాబాద్: ‘ఐరిస్ దెనా’పై అమెరికా దాడిలో మరణించిన 84మంది నావికుల మృతదేహాలను ఇరాన్ (ఎంబసీ) దౌత్య కార్యాలయానికి అప్పగించాల్సిందిగా శ్రీలంక కోర్టు బుధవారం ఆదేశించింది. దక్షిణ ఓడరేవు నగరమైన గాలెలోని గాలె హార్బర్ పోలీసుల అభ్యర్థన మేరకు బుధవారం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది. మృతదేహాలు ప్రస్తుతం గాలెలోని నేషనల్ ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్నాయి. రెండవ ఇరాన్ నౌకకు ఇంజిన్ సమస్యలు ఎదురవడంతో .. అందులోని 208 సిబ్బందికి శ్రీలంక 30 రోజుల ప్రవేశ వీసాలను మంజూరు చేసిందని ఉప రక్షణ మంత్రి అరుణ జయశేఖర మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం ఆ నౌక శ్రీలంక ఆధీనంలో ఉందని అన్నారు. సిబ్బంది, ఇతర అంశాలపై కొలంబోలోని ఇరాన్ దౌత్య కార్యాలయంతో శ్రీలంక విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే కొన్ని రోజుల్లో ఇరాన్ నుండి స్పందన వచ్చే అవకాశం ఉందని తాము ఆశిస్తున్నామని అన్నారు. భారతదేశం నిర్వహించిన నావికా విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఇరాన్ నౌక ఐరిస్ దెనాపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే.
రెండవ ఇరాన్ యుద్ధనౌక ‘ఐరిస్ బూషెహర్’ శ్రీలంక తీరం నుండి తొమ్మిది నాటికల్ మైళ్ల దూరంలో ఉందని, త్వరలో ఆ నౌకను తరలించనున్నట్లు శ్రీంలక మంత్రివర్గ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. ఈ యుద్ధనౌకను ట్రింకోమలి నౌకాశ్రయానికి తరలించనున్నట్లు గతవారం శ్రీలంక అధ్యక్షుడు ప్రకటించారు. అయితే రెండు యుద్ధనౌకల నుండి ప్రాణాలతో బయటపడిన వారిని స్వదేశానికి తరలించవద్దని అమెరికా శ్రీలంకపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. 183 మంది సిబ్బందితో కూడిన మూడవ ఇరాన్ నౌక ఐరిస్ లావన్ కేరళలోని కొచ్చి తీరంలో నిలిచి ఉంది.



