వ్యర్థాలతోనూ ఆర్ధికాదాయం…
అసోసియేట్ డీన్ హేమంత్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట : కొబ్బరి ఉప ఉత్పత్తులతో వివిధ హస్తకళలు తయారు చేసే నైపుణ్యాన్ని నేర్చుకొని,వాటిని భవిష్యత్తులో స్వయం ఉపాధిగా చేసుకుంటే నిరుద్యోగ యువత, మహిళలకు ఉపయోగ పడుతుందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం,కొబ్బరి అభివృద్ది బోర్డు సంయుక్తంగా నిర్వహించే కొబ్బరి హస్త కళ నైపుణ్య అభివృద్ది కార్యక్రమాన్ని ఆయన సోమవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో ప్రారంభించారు.
వ్యవసాయ విస్తరణ విభాాగం అధ్యాపకురాలు డాక్టర్ కె.శిరీష పర్యవేక్షణలో ఈ నెల (జూన్) 30 నుండి వచ్చే నెల (జులై) 05 తేదీ వరకు నిర్వహించే ఈ శిక్షణా శిబిరంలో బీహారు కు చెందిన మాస్టర్ ట్రైనర్ నికుంజ కొబ్బరి కాయలు, కొబ్బరి చిప్పల నుండి హస్తకళలు తయారు చేసే నైపుణ్యం నేర్పించనున్నారు. ఈ శిక్షణకు ఎంపికచేసిన 15 మంది ఔత్సాహిక యువత మరియు నిరుద్యోగ మహిళలు ఇందులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ కె.నాగాంజలి,డాక్టర్ ఎమ్.రాంప్రసాద్,డాక్టర్ టి.శ్రావణ్ కుమార్, సూపరింటెండెంట్ రవీంద్ర, చైతన్య స్వచ్చంద సంస్థ బాధ్యులు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.