– రాష్ట్ర వ్యవసాయ, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చేనేత కార్మికుల సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర వ్యవసాయ, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పిపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఆగస్టు 17 వరకు ఎగ్జిబిషన్, అమ్మకాలుంటాయని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు ఎన్నికైన వారిని మంత్రి సత్కరించారు. ఎగ్జిబిషన్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ మడత ఆసు మిషన్‌ను ఆయన పరిశీ లించారు. తెలంగాణ అథెంటిక్ వీవ్స్ లోగోను, త్రిలింగ పట్టు చీరలను మంత్రి తుమ్మల ఆవిష్క రించారు. అనంతరం మాట్లాడుతూ జియో ట్యాగింగ్‌లోనూ మన రాష్ట్రం ముందున్నదని చెప్పారు.
చేనేత కేవలం ఉపాధికి మార్గం మాత్రమే కాదనీ, భారతీయ సంస్కృతికి ప్రతీక అని అభి వర్ణించారు. ఈ వారసత్వ హస్తకళను పరిరక్షిం చాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. చేనేత రంగంలో తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిందనీ, గద్వాల, నారాయణ పేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, వరంగల్ దర్రిస్, కరీంనగర్ బెడ్‌షీట్లు వంటి ఉత్ప త్తులు అంతర్జాతీయంగా పేరుగాంచాయని చెప్పా రు. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలను కొనుగోలు చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. ఐఐహెచ్‌టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ చేనేత కళను కొత్త తరం వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. చేనేత కార్మికులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ చేనేత కళలన్నింటికీ పునర్వైభవం తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రెండు సంవత్సరాల కాలవ్యవధితో నేతన్న పొదుపు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. మరణించిన చేనేత కుటుంబానికి అండగా ఉండేలా నేతన్నకు భద్రతా పథకం ద్వారా మరణించిన కుటుంబ నామినీకి రూ.5 లక్షలు అందజేస్తున్నామన్నారు. చేనేత రుణమాఫీ కోసం రూ.33 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ. 6 వేలు వచ్చేలా నేతన్న భరోసా పథకాన్ని ప్రారంభించినట్టు వివరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఐఐహెచ్‌టీని ప్రారంభించి, 120 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినట్టు తెలిపారు.