నవతెలంగాణ – హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం మాజీ నాయకులు, సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర ఆడిట్ కమిటీ మాజీ సభ్యులు కామ్రేడ్ అన్నె అచ్యుతరామయ్య గారి 100వ పుట్టినరోజు వేడుకలు ఈరోజు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారి కుటుంబ సభ్యులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ వారికి హదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ వేడుకకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి. జ్యోతి అధ్యక్షత వహించగా, అచ్యుతరామయ్య గారి మనవడు విశ్వనాథ్‌సాయి నాయకులను వేదికపైకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు బొకే అందజేసి మాట్లాడుతూ.. అచ్యుతరామయ్య గారు తన జీవితంలో అత్యధిక భాగం ప్రజా సేవలో, ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుసంఘం నాయకుడిగా, ఆడిట్ కమిటీ సభ్యుడిగా మరియు రాష్ట్రం విడిపోయాక కూడా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని, సిద్ధాంతం పట్ల విశ్వాసం, ఆచరణ నేటి తరానికి ఆదర్శమని, 100 ఏళ్ల వయసులో కూడా పార్టీ అభివద్ధి కోసం ఆయన పడుతున్న తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య, టి. సాగర్, పి. ప్రభాకర్, పి భాస్కర్. ఎండి అబ్బాస్‌తో పాటు, ఆడిట్ కమిటీ కన్వీనర్ కెవిఎస్‌ఎన్ రాజు, వ్యవసాయ కార్మికసంఘం అఖిల భారత కార్యదర్శి బి వెంకట్, పార్టీ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని పాల్గొని అచ్యుతరామయ్య గారికి శుభాకాంక్షలు తెలిపారు. అచ్యుతరామయ్య గారి పెద్ద కుమార్తె వనజ, అల్లుడు చంద్రశేఖర్, రెండో కుమార్తె పుట్టగుండ శారద, మూడవ కుమార్తె ఉమ, అల్లుడు హరి మరియు మనవరాలు సౌమ్యతో పాటు ఇతర బంధుమిత్రులు పాల్గొన్నారు.



