నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలోని పలు దేశాల్లో క్రమేణా అభద్రతా భావం పెరిగిపోతుంది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ఆయా దేశాల్లో యుద్ధ భీతి నెలకొంది. అయితే యుద్ధ మేఘాలను ఢీకొనే సత్తా ప్రపంచ శాంతి దూతగా, శాంతిపరిక్షణ సంస్థగా ఐక్యరాజ్యసమితి పేరుగావించింది. కానీ ప్రస్తుత పరిస్థితులో పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను నిలువరించడంలో UNO విఫలమైందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేవలం పత్రిక ప్రకటనలతో, వార్షిక సమావేశాలతో సరిపెట్టుకుంటుందని అంతర్జాతీయ శాంతి దూతలు పెదవి విరుస్తున్నారు. అందుకు నిదర్శనం ఇటీవల పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అద్దం పడుతున్నాయని సోదరహంగా వివరిస్తున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జెనీవా కేంద్రంగా నానాజాతి ఏర్పడింది. ఆశించిన స్థాయిలో ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని నిలువరించడంలో, శాంతిని నెలకొల్పాడంలో నానాజాతి సమితి విఫలమైంది. దీంతో ప్రపంచదేశాలు రెండో ప్రపంచ యుద్ధానికి ఢంకా మోగించాయి. జపాన్ గుండెలపై రెండు అణు బాంబులను జారవిడిచి అమెరికా దేశం పైశాచిక ఆనందాన్ని పొందింది.
మొదటి ప్రపంచ యుద్దంతో పొల్చుకుంటే రెండో వార్‌లో అధిక నష్టాన్ని ప్రపంచ దేశాలు చవిచూశాయి. ఈక్రమంలో అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు కోసం సన్నాహాలు మొదలైయ్యాయి. 1945 అక్టోబర్ 24న విశ్వశాంతి పరిరక్షణ కర్తగా ఐక్యరాజ్యసమితి పురుడుపోసుకుంది. ఐదు అంగాలతో, నిర్థిష్టమైన కార్యాచరణతో ప్రపంచదేశాల మధ్య శాంతి పునర్ స్థాపనకు నడుంబిగించింది. సంస్థ ప్రారంభంలో కూడా పలు చేదు అనుభవాలు చవిచూసినా..కొంతమేరకు విజయం సాధించింది. ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్ది ఐక్యరాజ్యసమితి తన ప్రభావాన్ని కోల్పోతుంది. అందుకు ఇటీవల పలు దేశాల మధ్య యుద్ధ పరిణామాలు అద్దంపడుతున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఏండ్ల తరబడి యుద్ధం కొనసాగుతుంది. ఇరుదేశాలు భీకర దాడులతో, బాంబులతో మోత మోగిస్తున్నాయి. ఆయా దేశాల ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇరుపక్షాలు భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూస్తున్నాయి. రెండు దేశాల మధ్య సంవత్సరాల తరబడి వార్ నడుస్తున్న..యుద్ధ ముగింపునకు ఐక్యరాజ్య సమితి చొరవ చూపడం లేదని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదే విధంగా పశ్చిమాసియాలో అమెరికా అండతో ఇజ్రాయిల్ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోంది. పాలస్తీనా ప్రజలపై బాంబులు, వైమానిక దాడులతో ఉన్మాదాన్ని సృష్టిస్తుంది. నెతన్యాహు సైన్యం దాడితో ఇప్పటికే వేలమంది అమాయక పాలస్తీనా ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో ఐక్యరాజ్యసమతి ఇజ్రాయిల్ చర్యలను నిలువరించలేకపోకపోయింది. గాజాకు ఎటువంటి సాయం అందకుండా, ఆహార పదార్థాల రవాణాను అడ్డుకున్నా..ఐక్యరాజ్యసమితి ప్రకటనలతో ఖండించి సరిపెట్టుకుంది.
అంతేకాకుండా ఎలాంటి కారణంలేకుండా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రోద్భలంతో ఇరాన్ దేశంపై ఇజ్రాయిల్ క్షిపణులు ప్రయోగించింది. యుద్ధ నియమాలను ఉల్లంఘిస్తూ..ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాలరాస్తున్న ఇజ్రాయిల్ దేశంపై యూఎన్‌ఓ ఏ విధమైన చర్యలకు ఉపక్రమించలేదు. భద్రతా మండలిలో ఓ తీర్మానం ప్రవేశపెట్టి చేతులు దులుపుకుందని, పశ్చమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి కృషి చేయలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ప్రపంచ పెద్దన్నగా బీరాలు పలుకుతున్న ట్రంప్ పిచ్చిచేష్టలను ఖండించడంలో యూఎన్ ఓ వెనుకడుగు వేసింది. ఏకపక్షంగా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించి..ఆర్థిక సంక్షోభానికి కుట్ర పన్నిన ట్రంప్ చర్యలను అడ్డుకోలేకపోయింది. అనాలోచిత నిర్ణయాలతో, అనవసర జోక్యంతో పలు దేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాస్తున్న ఆమెరికా ఆగడాలను నిరోధించడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని ప్రపంచ శాంతికాముకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పహల్గాం దాడితో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని..ఇరుదేశాలు యుధ్దానికి సై అన్నాయి. ఈక్రమంలో కూడా ఐక్యరాజ్యసమితి తన నిస్సహాయ స్థితినిచాటుకుంది. ఏండ్ల తరబడి పాక్ కేంద్రంగా తీవ్రవాద కార్యాకలాపాలకు సహాకారం అందిస్తున్న..ఆ దేశ ప్రభుత్వాన్ని మందలించలేకోపోయింది.
ప్రపంచ దేశాల మధ్య శాంతి పునర్ స్థాపనకు ఐక్యరాజ్యసమితి కృషి చేయాలని, అందుకు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని యుద్ధ బాధిత దేశాల ప్రజలు కాంక్షిస్తున్నారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ భావాలను కట్డడి చేసి UNO విశ్వశాంతికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ప్రపంచ శాంతికాముకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా విశ్వశాంతి దూత ఏమేరకు శాంతి కోసం ఏ మేరకు సన్నాహాలు చేస్తుందో వేచి చూడాల్సిందే.