విద్వేషం

  ”సామాజిక సౌహార్థానికి భిన్న వర్గాల మధ్య సామరస్యానికి చిచ్చు పెట్టే క్లిష్ణ ప్రసంగాలు సమర్థనీయం కానే కాదు. ఎక్కడికక్కడ కుల, మత, ప్రాంతీయ విభేదాలు రాజేస్తూ ఓట్ల చలి మంటలు కాచుకునే విద్వేష ప్రసంగీకుల్ని అణచివేయని పక్షంలో రాజ్యాంగ విలువలు చచ్చుబడిపోతాయి” అని సర్వోన్నత న్యాయస్థానమే ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానం భయపడినట్టుగానే నేడు దేశంలో పరిస్థితులు నెలకొన్నాయి. యావత్‌ దేశాన్ని విద్వేష సునామీ ముంచెత్తుతోంది. నిజాలను వక్రీకరించి, మాటలకు కాలకూట విషం పులిమి మారణహౌమం సృష్టిస్తోంది.
”దేశమును ప్రేమించమన్నా మంచియన్నది పెంచుమన్నా” అని అప్పటి భారతీయులకు తెలుగు కవి ఇచ్చిన కొత్త పిలుపు. ”సుజలాం సుఫలాం మలయజ శీతలాం” అనే దేశభక్తికి భిన్నంగా ”దేశమంటే మనుషులు” అని కొత్త అర్థం చెప్పిన కవిత ఇది. ఇప్పటికీ దేశభక్తి చర్చనీయాంశంగా ఉంది. మనుషుల్ని కులం పేరిట, మతం పేరిట, ఆహారం పేరిట ఇంకా సవాలక్ష మౌఢ్యాలతో హింసిస్తూ దేశభక్తుల ముసుగులో తిరగడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అసలైన దేశభక్తి మనుషులను ప్రేమించడంలో ఉందని గురజాడ చెప్పిన మాటలు ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. అందుకే ఈ మహావాక్యానికి ఇంకా ప్రాసంగికత ఉంది. మనుషుల్ని ప్రేమించడం, మానవ శ్రమతో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడం, స్వయం సమృద్ధిని సాధించడం, కులమత మౌఢ్యాల నుంచి విముక్తమై దేశ ప్రజలంతా ఒక తల్లీబిడ్డలుగా బతకడం గురజాడ దృష్టిలో దేశభక్తి. కానీ, దేశంలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి.
దేశంలో సంగీతం విద్వేషాన్ని వ్యాపింపజేసే ప్రమాదకర మాధ్యమంగా మారిపోతోంది. దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని ఎగజిమ్మే పాటలు సోషల్‌ మీడియాలో కుప్పలుతెప్పలుగా వైరల్‌ అవుతున్నాయి. హిందూ రైట్‌ వింగ్‌ భావజాల సమర్థకులే వీటి కర్త కర్మ క్రియలు. ఈ పాటల్లో వాడుతున్న భాష అవమానకరంగా, బెదిరింపులతో కూడుకుని ఉంటోంది. మరోవైపు… చరిత్ర పుటలను మతం రంగు పులిమిన కళ్లద్దాలతో చూసేవాళ్లు… ఉత్తుత్త పుకార్లను చరిత్రగా నమ్మేవాళ్లు… చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. బడిలో ”భారతదేశం నా మాతృభూమి/ భారతీయులందరూ నా సహౌదరులు” అని ప్రతిజ్ఞ చేశాం. ఇప్పుడా ప్రతిజ్ఞకు తిలోదకాలిచ్చి ఒకరినొకరు చంపుకునే దుస్థితికి దిగజారిపోయాం.
విద్వేష భావజాలం వెళ్ళగక్కి సౌభ్రాతృత్వాన్ని చావుదెబ్బ తీసేవాళ్లపై ఫిర్యాదుల కోసం వేచి చూడకుండా ‘సుమోటో’గా కేసులు పెట్టాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. కేసుల నమోదులో ఏమాత్రం జాప్యం జరిగినా అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కూడా హెచ్చరించింది. అదే జరిగి ఉంటే నేడు ఇలా అగ్నిగుండంలా మారుతుందా?
ఒకరికొకరై అందరొక్కటై కుల మత ప్రాంతీయ భాషా భేదాలకు అతీతంగా ఒకే జాతిగా భారతీయులు ప్రగతి పధాన పురోగమించాలని అలనాటి రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. జరుగుతున్నదేమిటి? ఉమ్మడి భావన బీటలువారుతోంది. సంకుచిత భావజాల ప్రచారం విభేదాలకు, సామాజిక అశాంతికి, చీలికలకు పాలుపోస్తోంది. జన సమూహాల నడుమ కత్తులు దూసుకునే శత్రుత్వాలకు, నెత్తుటేళ్లు పారించే వైషమ్యాలకు అంటుకడుతోంది. ఈ దుష్ప్రచారాన్ని క్షణాల వ్యవధిలో అసంఖ్యాకులకు చేరవేయడంలో సామాజిక మాధ్యమాల యూనివర్సిటీ విద్యార్థులు తల మునకలై ఉన్నారు. అశ్లీల, అసభ్య సమాచార వాహికలుగా బ్రష్టుపట్టి పరువు మోస్తున్న సామాజిక మాధ్యమాలు విద్వేష వ్యాఖ్యల పంపిణీ ఏజెన్సీలుగా దిగజారి కలుషిత సాగరాల్ని తలపిస్తున్నాయి. తద్వారా వాటిల్లే విపరీత నష్టాల తీవ్రతను ముందుగానే ఊహించి కావచ్చు. అయిదేండ్ల క్రితమే తెహసీన్‌ పూనావాలా! కేసులో న్యాయపాలిక ఘాటుగా స్పందించింది. అసహనం, భావజాలపరమైన ఆధిపత్యం, దురభిప్రాయాల కుదుళ్ల నుంచి పుట్టుకొచ్చే విద్వేష నేరాలను ఏమాత్రం సహించరాదని అప్పట్లోనే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించింది. అందుకనుగుణంగా వ్యవస్థాగత సన్నద్ధత కొరవడిన పర్యవసానంగా విద్వేష దావానలం పోనుపోను ప్రజ్వరిల్లుతోంది. ఇది స్వార్థపర శక్తులు తమ ప్రయోజనార్థం సృష్టిస్తోన్న అగాథాల జ్వాల. విధ్వంసాల హేల. యువత దీన్ని గుర్తెరిగి ఎదుర్కోవాల్సి ఉంది. అన్ని వ్యవస్థలకూ ఇది పాకుతోంది. ద్వేషం మనిషిని అమానవీయంగా మారుస్తుంది. దేశం ముందుకు పోవాలంటే విద్వేషాలను కాల్చేయాల్సిందే.

Spread the love