నవతెలంగాణ-హైదరాబాద్ : కన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా ఆ తల్లిదండ్రులు గుండె నిబ్బరం చేసుకున్నారు. తమ బిడ్డ ఇక లేడన్న తీవ్ర విషాదంలోనూ, మరో ఏడుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించి ఆదర్శంగా నిలిచారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి అవయవాలను దానం చేసి, మానవత్వాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఎస్ఆర్‌పురం మండలం సింధురాజపురం గ్రామానికి చెందిన నిరంజన్‌కుమార్ చౌదరి (40) గత నెల 31న కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో గత శుక్రవారం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ నిరంజన్‌కుమార్‌ను పరీక్షించిన వైద్యులు, అతను అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ క్లిష్ట సమయంలో వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు అవయవదానం ప్రాముఖ్యత గురించి వివరించారు. పుత్రశోకంతో కుమిలిపోతున్నప్పటికీ, నిరంజన్ కుటుంబ సభ్యులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరి ప్రాణాలు నిలబెట్టాలని భావించి, అవయవదానానికి అంగీకరించారు.
దీంతో వైద్యులు ఆదివారం రాత్రి నిరంజన్‌కుమార్ నుంచి కిడ్నీలు, కళ్లు, కాలేయం సహా పలు కీలక అవయవాలను సేకరించి, అవసరమైన ఏడుగురు రోగులకు అమర్చారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున నిరంజన్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కన్నకొడుకును కోల్పోయిన ఆ కుటుంబం, తమ గొప్ప నిర్ణయంతో సమాజానికి ఆదర్శంగా నిలిచింది.