నవతెలంగాణ – హైదరాబాద్: వాళ్ల వయసు నిండా 16 ఏండ్ల కూడా లేదు. పదో తరగతి చదువుతున్నారు. తమను చెంపదెబ్బ కొట్టాడన్న కోపంతో మరో బాలుడిపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని గౌతమ్ నగర్ చెందిన 16 ఏండ్ల విద్యార్థి రోజూ స్థానిక స్నూకర్ క్లబ్‌కు వెళ్తుండేవాడు. ప్రస్తుతం అతడు10వ తరగతి చదువుతున్నాడు. తనతోపాటు పదో తరగతి చదివే ఇతర విద్యార్థులు కూడా ఆ స్నూకర్ క్లబ్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలో గతంలో వారి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఒక విద్యార్థి మరో ఇద్దరు విద్యార్థులను చెంపదెబ్బలు కొట్టాడు. అది మనుసులో పెట్టుకున్న ఇద్దరు విద్యార్థులు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఈ నెల 15న స్నూకర్ క్లబ్‌లో తమను కొట్టిన విద్యార్థిపై మిగతా ఇద్దరు విద్యార్థులు ఒకరు కత్తి, మరొకరు డాగర్ తీసుకుని వచ్చి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కేవలం 30 సెకన్‌లలోనే 27 సార్లు పొడిచారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మొబైల్‌లో చిత్రీకరించారు. ఆ వీడియోను ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి దాడి కేసు నమోదు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. బాధితుడి మెడికల్ రిపోర్టును బట్టి నిందితులపై సీరియస్ అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.



