నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాల చిట్టా కలకలం రేపుతోంది. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా బుధవారం జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు మల్కాజిగిరి కోర్టులో ఆయన్ను సీఐడీ హాజరుపరచనుంది. జగన్మోహన్‌తో పాటు శ్రీనివాసరావు, సునీత్, రాజేందర్ యాదవ్, కవితను సీఐడీ అరెస్టు చేసింది.
హెచ్‌సీఏ అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) అధ్యక్షుడు గురువారెడ్డి వివరంగా మాట్లాడారు. ‘హెచ్‌సీఏలో జగన్మోహన్ రావు అక్రమాలకు పాల్పడ్డాడు. హెచ్‌సీఏలోకి అక్రమంగా జగన్మోహన్ ఎన్నిక అయ్యాడు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కి సభ్యత్వం లేకపోయినా.. ఫోర్జరీ చేసి ఎన్నికల్లో నిలబడ్డాడు. గౌలిపుర క్రికెట్ క్లబ్ సెక్రటరీ సంతకాలను ఫోర్జరీ చేశారు. మాజీమంత్రి కృష్ణ యాదవ్ సంతకాలని ఫోర్జరీ చేసి ఎన్నికల్లో దిగారు. జగన్మోహన్, రాజేంద్ర యాదవులు కలిసి హెచ్‌సీఏలో అక్రమాలు చేశారు. జగన్మోహన్ వందల కోట్ల రూపాయలను హెచ్‌సీఏ నుంచి దోచుకున్నాడు. క్రికెట్ డెవలప్మెంట్ కోసం బీసీసీఐ ఇస్తున్న నిధులు మొత్తం సొంతానికి వాడేసుకున్నాడు. హెచ్‌సీఏలో సభ్యత్వానికి అర్హత లేకపోయినా దొడ్డి దారిన జగన్మోహన్ వచ్చాడు. తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల్లో నిలబడ్డాడు, హెచ్‌సీఏ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని గురువారెడ్డి కోరారు.