– నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
నవతెలంగాణ కంఠేశ్వర్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( డబ్ల్యూహెచ్ఓ) పిలుపునకు అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సోమవారం మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్‌కు చెందిన వైద్యులు ప్రజలకు కొరకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత జీవనశైలిలో మార్పుల వల్ల మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డా. ఆనంద్ మాలు మాట్లాడుతూ..
ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా, నిరంతర వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా శరీరానికి తగినంత నీరు తీసుకోవడం, జంక్ ఫుడ్‌ను తగ్గించడం అవసరమని తెలిపారు.
డా. అంజలి, ఫిజిషియన్ మాట్లాడుతూ..
మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమని పేర్కొన్నారు. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం చేయాలని సూచించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఆరోగ్యం వ్యక్తిగతమైనదే కాకుండా సామాజిక బాధ్యత కూడా అని వైద్యులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్వామి, డియంఏస్ డా.యజ్ఞ మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు.



