- Advertisement -
- – రాబోవు రోజుల్లో ప్రతి గ్రామంలో మైదానాల ఏర్పాటుకు సీఎం రేవంత్ సర్కారు కృషి
– తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి - నవతెలంగాణ- దుబ్బాక
- గత పదేళ్లలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం, చెడు వ్యసనాలకు బానిసై పెడదారిన పట్టిన యువతను క్రీడల వైపు మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ .. యువతను క్రీడల పట్ల ప్రోత్సాహిస్తూ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తుందని తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి చెప్పారు. ప్రతి గ్రామం నుంచి క్రీడాకారుల్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో సీఎం కప్ పోటీలను గ్రామస్థాయి నుంచే నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. మంగళవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో మోడల్ స్కూల్లో “పీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీల”కు టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ పణ్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే. రమేష్ కుమార్ తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. విన్నర్ (ఇబ్రహీంపూర్), రన్నర్ (చేగుంట) టీం లకు మెడల్స్ తో పాటు బహుమతులను అందజేసి మాట్లాడారు.
గత ప్రభుత్వం క్రీడల శాఖను నిర్వీర్యం చేసిందని, పదేళ్లలో కేవలం రూ. 350 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. క్రీడలకు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడంతో యువత పెడదారిన పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఈ రెండేళ్లలోనే రూ.850 కోట్లను క్రీడలకు కేటాయించిందని, నిరుపయోగంలో ఉన్న గచ్చిబౌలి స్టేడియాన్ని రూ.28 కోట్లతో పునరుద్ధరించడం జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు క్రీడా శాఖలోనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించే దిశగా రేవంత్ సర్కార్ పరిశీలిస్తుందన్నారు.
నికత్ జరీన్, సిరాజ్ లకు డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి క్రీడాకారుల్ని గౌరవించిన ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. గ్రామీణ క్రీడాకారులు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగేలా సాధన చేయాలని అందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫున యువతకు అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చందిరి సంజీవరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందె రాజిరెడ్డి, ఇస్తారిగల్ల మల్లేష్, ఆర్గనైజర్స్ బిజ్జ గిరిబాబు, చంద్రకాంత్, ప్రభు, రవీందర్, పలువురు పీడీలు, పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు.
- Advertisement -