కాళేశ్వరం నివేదికపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై శుక్ర వారం ఉన్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కోర్టుకు అందించారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామని సీజే ధర్మాసనానికి తెలిపారు. అయితే కమిషన్ నివేదికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నివేదిక వెబ్‌సైట్‌లో ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం, కమిషన్‌కు మూడు వారాలు, ప్రతివాదుల కౌంటర్‌పై జవాబివ్వడానికి పిటిషనర్లకు వారం గడువిచ్చింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలుంటాయని ఏజీ చెప్పిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది.
కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణ వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES