– ఈదురుగాలులు, ఉరుములతో దంచికొట్టిన వాన
– జలమయమైన నగరం..రోడ్లపై విరిగిపడిన చెట్లు
– ట్రాఫిక్‌కు అంతరాయం..రెడ్ అలర్ట్ జారీ
– నిలిచిన 100కి పైగా విమానాలు..మరో 25 దారి మళ్లింపు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో ఈదురుగా లులు, ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రహదారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వందకు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో 25కి పైగా విమానాలను దారి మళ్లించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీచేసింది. ప్రతికూల వాతారణంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడిందనీ, ఇంకా సర్వీసులను పునరుద్ధరించలేదని వివరించింది. ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరింది. శనివారం రాత్రి 11:30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4:00 గంటల మధ్య సుమారు 49 విమానాలను దారి మళ్లించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 81 మిల్లీ మీటర్లు, పాలంలో 68 మిల్లి మీటర్లు, పూసా 71 మిల్లి మీటర్లు, మయూర్ విహార్‌లో 48 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వెల్లడించింది. భారీ వర్షంతో మింటో రోడ్డు వద్ద ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఒక కారు మునిగిపోయింది.
ఢిల్లీకి రెడ్ అలెర్ట్
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీకి రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఢిల్లీ, దాని పరిసర రాష్ట్రాల్లో ధూళి తుఫాను, ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందనీ, గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వివరించింది.
ఎయిర్‌పోర్ట్‌లో కూలిన రూఫ్ భాగం
దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఉన్న రూఫ్ కొంత భాగం కూలిపోయింది. దీంతో అక్కడున్న వ్యక్తులు భయంతో పరుగులుతీశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీచేసింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రూఫ్ భాగం కూలిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఢిల్లీలో భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES