నవతెలంగాణ – హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. మండి జిల్లాలోని బగిపుల్ ప్రాంతంలో ప్రషార్ సరస్సు సమీపంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వందల సంఖ్యలో స్థానికులు, యాత్రికులు మండి-ప్రషార్ రోడ్డులోని బగ్గీ వద్ద చిక్కుకుపోయారు. ఉత్తరాదిన కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం బాగిపుల్ ప్రాంతంలో ఆకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. భారీ వరదలతో ఇళ్లు,రోడ్లు, పరిసరప్రాంతాలు కొట్టుకుపోయాయి.ఆకస్మిక వరదల కారణంగా స్థానికులు, యాత్రికులు దాదాపు 200 మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. హనోగీ మాతా ఆలయ సమీపంలోని మండి జాతీయ రహదారిపై ఆకస్మిక వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. మనాలి నేషనల్ హైవేపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మండి-కులుల మధ్య రోడ్డు బ్లాక్ కావడంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 15 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. వందల సంఖ్యలో టూరిస్టులు, స్థానికులు ఎటూ కదలలేని పరిస్థితి. తినడానికి హోటళ్లు కూడా లేవు. కొండ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో శనివారం సాయంత్రం హైవే బ్లాక్ చేయబడింది. రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.