షెఫాలీ షా… కాసుల వర్షం కురిపించే కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి తన చిత్రాలతో మహిళల స్వరాన్ని వినిపిస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినిమాలో ఓ ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. శక్తివంతమైన నటీమణులలో ఒకరిగా అద్భుతమైన ఖ్యాతిని సంపాదించు కున్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమం లో పాల్గొన్న ఆమె ఓ నటిగా తన ప్రయాణం, భారతీయ సినిమాలో వస్తున్న మార్పులు, ఎదుర్కొంటున్న ఆటుపోట్లు, తనను నడిపిస్తున్న వ్యక్తిగత దిక్సూచి గురించి ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో పంచుకున్నారు.
1972 మే 22న ముంబయిలో పుట్టిన షెఫాలీ హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 1995లో రంగీలా సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 1999లో విడుదలైన సత్య సినిమాలో ఆమె నటనకు ఉత్తమ నటి(క్రిటిక్స్) విభాగంలో ఫిలింఫేర్ అవార్డును, 2009లో విడుదలైన ది లాస్ట్ లీర్ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
పాత్రలకు జీవం పోస్తూ…
సంక్లిష్టమైన మహిళల నిరాడంబరమైన చిత్రణలకు పేరుగాంచిన షెఫాలీ బాలీవుడ్ వాణిజ్య ఉచ్చుల నుండి ఆమెను ఆమే వేరు చేసుకున్నారు. ఢిల్లీ క్రైమ్‌లో స్టాయిక్ పోలీస్ ఆఫీసర్‌గా, డార్లింగ్స్ లో దృఢత్వం కలిగిన తల్లిగా, హ్యూమన్‌లో వివాదా స్పద వైద్యురాలిగా ఆమె తాను పోషించిన పాత్రలకు జీవం పోశారు. ఏప్రిల్ 26న చెన్నైలో జరిగిన శివ్ నాడార్ ఫౌండేషన్ ఈవెంట్ ఇగ్నిషన్‌లో మాట్లాడుతూ ఆమె తన కెరీర్ పథం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, భారతీయ సినిమాలో మహిళలకు పెరుగుతున్న అవకాశాల గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. తన వ్యక్తిగత అనుభవాలను ఆధారంగా చేసుకుని అటు తెరపై ఇటు తెర బయట తన ఎంపికల వెనుక ఉన్న చోదక శక్తుల గురించి వివరించారు.
అంతర్గత జీవితానికే…
‘నేను ఒక పాత్రను ఎంపిక చేసుకునేటపుడు దాని ప్రభావం లేదా అవార్డు వస్తుందా లేదా అనే విషయం గురించి ఆలోచిస్తూ సంప్రదించను. పోషించే పాత్రకు, కథకు నిజాయితీగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తాను’ అంటున్నారు. ఆమె పాత్రలో గ్లామర్ కన్నా అంతర్గత జీవితానికే ప్రాముఖ్యత ఉంటుంది. ఆమె కెరీర్ రాత్రికి రాత్రే సూపర్‌స్టార్‌డమ్‌తో కూడుకున్నది కాదు. అత్యంత క్లిష్టమైన సినీ పరిశ్రమలో ఆమె అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. సత్య(1998), మీరా నాయర్ మాన్సూన్ వెడ్డింగ్ (2001) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రోజువారీ జీవితంలో బయటకు చెప్పుకోలేని భారాలతో పోరాడుతున్న పాత్రల్లో ఇమిడిపోయారు.
పూర్తి భిన్నంగా…
చాలా కాలంగా స్త్రీలు కేవలం సపోర్టింగ్ పాత్రల్లో మాత్రమే నటించ గలుగుతున్నారు. హీరోకు ప్రాధాన్యం ఇచ్చే ఈ పరిశ్రమలో ఆమె ఎంపికలు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. ఆ పాత్రలన్నీ భావోద్వేగాలతో, సంక్లిష్టతతో నిండి ఉంటాయి. ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు షెఫాలీ వంటి నటుల కోసం అవకాశాలు విస్తృతం చేశాయి. ఢిల్లీ క్రైమ్‌లో ఆమె పోషించిన డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలకు ఆమె విశేషమైన ప్రశంసలు అందుకున్నారు. ఈ పాత్రకుగాను ఆమెకు ఉత్తమ డ్రామా సిరీస్‌గా అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు కూడా లభించింది. అదే సమయంలో డార్లింగ్స్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆంగ్లేతర భారతీయ ఒరిజినల్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది ఆమె తన పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యతకు ఓ నిదర్శనం.
వైవిధ్యం ప్రతిబింబించేలా…
గత కొన్నేండ్లుగా భారతీయ సినిమాలో తాను చూసిన మార్పు గురించి మాట్లాడుతూ ‘ఒక మార్పు జరుగుతోంది. కథలు మరింత సమగ్రంగా మారుతున్నాయి. నిజ జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించే కథనాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. పాత నియమాలకు కట్టుబడకుండా నేటి తరానికి అవసరమైన కథలను చెప్పడానికి ఇది ఉత్తేజకరమైన సమయం’ అంటున్నారు. పరిశ్రమలో ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ షెఫాలీ తాను ఎంచుకుంటున్న పాత్రల పట్ల వివేచనతో ఉన్నారు. ఓ నటిగానే కాక దర్శకురాలిగా కూడా ఆమె తనలోని ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2021లో ఆమె రెండు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవి సమ్‌డే – హ్యాపీ బర్త్‌డే మమ్మీజీ, రెండూ ఒంటరితనం. ఇవి మహిళల అంతర్గత జీవితాలను అన్వేషిస్తాయి.
అవకాశాలు తగ్గినా…
ప్రపంచాన్ని స్పష్టమైన దృష్టితో చూడటం ఆమె రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘నిర్భయ కేసు ఆధారంగా తీసిన ఢిల్లీ క్రైమ్ వాస్తవికతకు దగ్గరగా ఉంది. ప్రజలు ఈ కథను లోపలి నుండి చూడాలని మేము కోరుకున్నాం’ అని ఆమె అన్నారు. ఆమె పాత్రలు తరచుగా అధికారంలో ఉన్న మహిళలు లోతైన భారాలను మోస్తూ ఎలా జీవిస్తున్నారో చర్చిస్తాయి. (ఉదాహరణకు జల్సా – 2022). ఆమె చేస్తున్న ఈ ప్రయాణంలో అనేక అవాంతరాలు కూడా ఎదుర్కొన్నారు. కేవలం వ్యాపార ధోరణిలో నడిచే పరిశ్రమలో తనని తాను నిరూపించుకునే పాత్రలు రావడం గురించి కూడా ఆమె నిజాయితీగా పంచుకున్నారు. ‘నాకు వచ్చిన పాత్రలు నన్ను ఉత్తేజపరచలేదు, అలా అని నన్ను సవాలు చేయలేదు. అయితే కోరుకున్న పాత్ర వచ్చే వరకు వేయి ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. దీని వల్ల తక్కువ అవకాశాలు వస్తున్నప్పటికీ ముఖ్యమైన వాటినే నేను కోరుకుంటున్నాను’ అంటున్నారు.
ఓపిక ఫలించింది
ప్రతిధ్వని, సత్యంలో ఆమె పోషించిన పాత్రలతో అటువంటి గొప్ప పాత్రలు చేసే అతి కొద్దిమంది నటులలో ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ముగింపులో ఆమె భారతీయ సినిమా భవిష్యత్తు గురించి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. ‘కంటెంట్‌లో మనం చివరి స్థానంలో ఉన్నాం. ప్రేక్షకులు వివిధ రకాల కథల కోసం ఎదురు చూస్తుంటారు. అది నాలాంటి కళాకారులకు విముక్తినిస్తుంది’ అని ఆమె అన్నారు. తరచుగా మార్పులకు గురవుతున్న పరిశ్రమలో షెఫాలీ ప్రామాణికత పట్ల దృఢమైన నిబద్ధత ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టడమే కాదు, నిశ్శబ్దమైన, మరింత కష్టతరమైన, చివరికి మరింత శాశ్వతమైన మార్గంలో నడవడానికి ఎంచుకునే భారతీయ నటులకు విజయం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది.
నిజ జీవితాలే ఆమె పాత్రలు
- Advertisement -
- Advertisement -