Sunday, May 25, 2025
Homeసోపతిఆమె లోపలి 'సంఘర్షణ'

ఆమె లోపలి ‘సంఘర్షణ’

- Advertisement -

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ చిక్కటి కవిత్వం రాసే చక్కటి కవి. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన కవి. ఇప్పటిదాకా రెండు కవితా సంపుటులు వెలువరించారు. ఒకటి ‘దుఃఖానంతర దశ్యం’, రెండోది ‘పరావలయం’. ఈ మధ్య కాలంలో వారు రాసిన ‘ఆమె-పూలు’ కవితను పరిశీలిద్దాం.
కవి కాంచని చోటు ఉండదు. భూమి మీది చిన్ని చీమ నుంచి ఆకాశంలోని మబ్బుతునక దాకా దేన్ని వదిలిపెట్టడు. కవికి పరిశీలనా దృష్టి ఎక్కువగా ఉంటుంది. కవిది చలించే మనస్తత్వం. తనను కదిలించిన ప్రతీ అంశాన్ని కవిత్వం చేస్తాడు. ఈ కవిత కూడా కవి చలించి రాసినదే. పూలు అమ్ముకునే ఆమె గురించి రాసిన కవిత ఇది. ‘ఆమె- పూలు’ అని పేరును చదవగానే ఆమెకు, పూలకు మధ్య సంబంధం ఉన్నదన్న విషయం అర్థమవుతుంది. కవిత మొదట్లో ఆమె పూలను కొంటుందా? ఆమెను కవి పూలతో పోలుస్తున్నాడా? ఇట్లాంటి విభిన్న ఆలోచనలు కలుగుతాయి. ఇది కవి సాధించిన మొదటి విజయం.
చదువుతూ పోతుంటే కవితలోని సారం పూర్తిగా అర్థమవుతుంది. ఎత్తుగడను చక్కటి అభివ్యక్తితో ప్రారంభించాడు. దీనికోసం కవి వాడుకున్న పదాలు అక్కడ ఆమె పూలు అమ్ముకుంటున్న సందర్భంలో కనిపించే పూలబుట్ట, పూలే. ఆమె పూలు అమ్ముకునే సాధారణ స్త్రీ కానీ ఆమెలో ఉన్న మానవీయత గొప్పది. ఈ విషయాన్ని చెప్పటంలో కవి మానవపువ్వై పరిమళిస్తున్నది అని చెప్పాడు. సాధారణ పూలు అమ్ముకునే స్త్రీ లోని మానవీయతను చాలా మంది చూడలేరు. వాళ్ళ పూలు కొనుక్కుని ఆదరాబాదరాగా వెళ్ళిపోవటమే చేస్తారు.
ఈ సందర్భాన్ని కవి ఒక్కడే చూడగలుగుతాడు. చూసి ఇలా సమాజానికి తెలియపరుస్తాడు. పూలు కొనే సందర్భంలో చూడనివాడు కవిత రూపంలోకి వచ్చాక చదివి వారి మానవీయతను తెలుసుకో గలుగుతాడు. అందుకే కవి సమాజంలో నిర్వహిస్తున్న పాత్ర గొప్పదని చెప్పుకోవచ్చు.
వస్తువును నిర్వహించుకుంటూ పోతున్న సందర్భంలో కొన్ని సంఘటనలు చేర్చాలి. ఇది వస్తుగత కవిత్వం కాబట్టి ఆమె చేస్తున్న పనుల్లోంచే కవి కవితను నిర్మించుకుంటూ వెళ్ళాలి. ఒక వేళ కవి కేవలం భావాన్ని రాబట్టడం కోసమే అయితే ఆ ఊహాలు వేరేగా ఉంటాయి. అందుకే కవి పూలను ఏయే చోట్ల ఉపయోగిస్తారు. ఏయే కాలాల్లో లభిస్తాయో చెబుతూ శుభకార్యాలే కాదు, అపకార్యాల్లో కూడా ఎలా వాడుతారో వివరించారు. కవి తక్కువ పంక్తుల్లో ఎంతో సారాన్ని పట్టుకొచ్చాడు. మేలిమి కవిత లక్షణాలు ఇలానే ఉంటాయి.
పూలు అమ్ముకునే ఆమె ప్రతి రోజు యుద్ధమే చేస్తుంది. ఇది అంతర్గత యుద్ధం. లోలోపలే కుమిలిపోయేలా చేసే యుద్ధమిది. పూలు అమ్మిన రోజు ఆమెకు సంతోషం. పూలు అమ్మని రోజు ఆమె దుఃఖం వర్ణనాతీతం. ఈ విషయం చెప్పటానికి కవి వాడిన ప్రతీక ‘వాడిపోయిన పూలదండ’. ఆమె ప్రతీ కాలంలో ఆయా పూలను అమ్ముతుంది. ఎండను లెక్కచేయదు. వానను లెక్కచేయదు. తీరిక లేకుండా పనిచేస్తూనే ఉంటుంది. కానీ తీసుకున్న గిరిగిరి పైసలు కూడా పూడవు. ఒక్కరోజు పూలు అమ్మకపోయినా, అమ్ముడు పోకపోయినా తను కట్టాల్సిన అప్పు ఊపిరాడనివ్వదు. కవి బయటికి కనిపించే పూల సౌందర్యమే కాదు, శ్రమజీవనంలోని లోపలి సంఘర్షణను పట్టుకున్నాడు చూశారా! అక్కడ కవి నిటారుగా నిలబడ్డాడు. ముగింపును కూడా అక్కడ ఉన్న దశ్యాలతోనే నిర్మించాడు. రోజు ఆమె ఎన్ని పూలమ్మినా పొట్టకు, బట్టకు మాత్రమే సరిపోతుంది. అప్పులు పూడ్చలేని స్థితి. ఇది చెప్పటానికి కవి ఖాళీ పూలబుట్టలను, రాలిపువ్వులను ప్రతీకలుగా చేసుకున్నాడు. కడుపు నిండినవాడి జీవితంలో అన్నీ ఆనందాలే.
కడుపు ఎండుతున్న వాడి జీవితంలో అన్నీ శూన్యాలే.
కవి పూలమ్మే ఆమె జీవితాన్ని లోతుల్లోకి పరిశీలించి దైనందిన జీవితంలో ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులను కవిత్వం చేసి ఓ కొత్త చూపునిచ్చాడు. ఇకనుంచి పూలనో, పండ్లనో, కూరగాయలనో, ఇంకేవే కొనే చోటనో కొసరడం మానుదాం. ఎదురుగా కుప్పబోసుకున్న పూలను గురించే కాదు, అందులోంచి ఉత్తగనే వాడిపోతున్న పూలలెక్కతీద్దాం.

ఆమె -హొ పూలు
సువాసనల బుట్ట విప్పుతున్న చిరునవ్వు
చుట్టూ పూల బుట్టలు
తను మధ్యలో మానవ పువ్వై
పరిమళిస్తున్న సమయం
పూజకో, పెండ్లికో, ఉత్సవానికో, ఊరేగింపుకో
రెండు హదయాల సంగమానికో
రెండు దేహాలు విడిపోతున్న దుఃఖానికో
శిశిరానికో, వసంతానికో
పూలు ఆమె ఇవ్వాల్సిందే,
ఆమె పువ్వై నవ్వాల్సిందే
పరిమళంగా – పవిత్రంగా .
అమ్మకం రోజూ ఒక యుద్ధమే
ఎడతెగని బేరాల సలపరింత
మరోవైపు గిరాకీ పులకరింత
ఒక్కొక్కసారిహొఅలికిడి లేక ఆవలింత
పూలు అమ్మినమా? లేదా??
అమ్మకుంటే ఆ రోజుకు
ఆమె నిలువెత్తు వాడిన పూల దండ.
వానకు తడిసిన పువ్వై
చలి కాలపు మలి సంధ్య వేళ చీకటి పువ్వై
ఎండవేడికి పొద్దున్నే వాడిన పువ్వై
ఆమె పువ్వు పువ్వుకు పైసల లెక్కై
సాయంత్రానికి అప్పుల కిస్తీ అయి
ఖాళీ పూల బుట్టల మధ్య
ఆఖరి క్షణానికి రాలిన పూల రెమ్మల్లో ఆమె.
– ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌, 9849082693

– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -