అబద్ధాలపై నిలబడ్డ హామీలు, ఆ హామీలపై నడుస్తున్న రాజకీయాలు, దానివెనుక దాగున్న వాస్తవాలు – ఇవన్నీ కలిసినప్పుడు ప్రజాస్వామ్యం ఏ దిశగా సాగుతోందో అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కనిపిస్తున్న పరిణామాలు కూడా ఇదే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర రాష్ట్రాల్లో చేసే వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలు, వాటి అమలు మధ్య ఉన్న వ్యత్యాసం రాజకీయ నైతికతపై తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజల ముందుంచిన ”గ్యారంటీలు” పెద్దఎత్తున ఆకర్షణీయంగా వినిపించాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, మహిళలకు, యువతకు, రైతులకు ఆశలు కల్పించాయి. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలు విషయంలో స్పష్టత లేకపోవడం, ఆలస్యం జరగడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. హామీలు ప్రకటించిన వేగంతో అమలు జరగకపోతే, అవి ప్రజలకు నమ్మకద్రోహంగా మారే ప్రమాదం ఉంది. ప్రజలు మాటలు కాదు, కార్యాచరణనే విశ్వసిస్తారు. మాటల్లో గొప్పదనం చూపించడంకంటే, నేలమీద ఫలితాలు చూపించడం ముఖ్యం.
ప్రజాస్వామ్యంలో హామీలు సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోకుండా ఇస్తే, అవి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకే పరిమితమవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు రాజకీయ నాయకులపై నమ్మకం కోల్పోతారు. ఒకసారి నమ్మకం దెబ్బతింటే, అది తిరిగి పొందడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఏ హామీ ఎప్పుడు అమలు చేస్తారు? దానికి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అమలులో ఎదురవుతున్న అడ్డంకులేమిటి? వంటి ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానాలివ్వాలి. లేకపోతే, ”హామీలు” అన్నవి కేవలం రాజకీయ నినాదాలుగానే మిగిలిపోతాయి. ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ” ఆరు గ్యారంటీలు” అనే నినాదంతో భారీ ఆశలను రేకెత్తించింది. ఈ హామీలు కేవలం ఎన్నికల మేనిఫెస్టోలోని మాటలు మాత్రమే కాదు, ప్రజల జీవితాలను మార్చే భరోసాలుగా ప్రచారం చేయబడ్డాయి. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, రైతు కూలీలకు ఆర్థిక భరోసా, దళిత కుటుం బాలకు 12 లక్షల రూపాయలు కేేటాయిస్తామని చెప్పి , ఇలా ప్రతి వర్గాన్ని ఆకట్టుకునే విధంగా హామీలిచ్చారు. వీటి ఆధారంగానే ప్రజలు తమ ఓటును వినియోగించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం విచారకరం.
ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండున్నరేళ్లు గడిచినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని చెప్పినా, జాబ్ క్యాలెండర్ ఇంకా అమల్లోకి రాలేదు. యువతలో పెరుగుతున్న నిరాశనే దీనికి నిదర్శనం. మహిళలకు నగదు హామీ నేటికీ అమలు కాలేదు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన, అది కేవలం మాటలకే పరిమితమైంది. బీసీ సబ్‌ప్లాన్ పేరుతో భారీ నిధులు కేటాయిస్తామని చెప్పినా, ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో ప్రజలకు స్పష్టత లేదు. ఇది కేవలం పరిపాలనా లోపమా? లేక ప్రజలను మభ్యపెట్టే రాజకీయ వ్యూహమా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి స్వయంగా ”రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు” అని చెప్పిన సందర్భాలు అనేకం. అదే సమయంలో ఎన్నికల సమయంలో భారీ హామీలివ్వడం ఎంతవరకు బాధ్యతాయుతమైన చర్య? ప్రజల నమ్మకాన్ని పొందడానికి ఇచ్చిన ఈ హామీలు ఆర్థిక వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయా అనే సందేహం కలుగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ వైఖరిపై మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో కమ్యూనిస్టుల పోరాటాలను ప్రశంసిస్తూ, కేరళంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. ”ఎల్డీఎఫ్‌కు ఓటేస్తే అది మోడీకి ఓటు వేసినట్టే” అనే వ్యాఖ్య రాజకీయంగా తీవ్ర విమర్శలకు గురైంది. దేశ రాజకీయాల్లో సీపీఐ(ఎం), బీజేపీ మధ్య ఉన్న సిద్ధాంత భేదాలు అందరికీ తెలిసినవే. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలను ఒకే తాటిపై పెట్టడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. కేరళం రాష్ట్రాన్ని పరిశీలిస్తే, అక్కడి అభివృద్ధి సూచికలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, అక్షరాస్యత, సామాజిక చైతన్యం, ప్రతి అంశంలో కేరళం ముందంజలో ఉంది. అక్కడ విద్యకు సుమారు 24శాతం బడ్జెట్ కేటాయిస్తే, తెలంగాణలో అది సుమారు ఎనిమిది శాతం మాత్రమే. కేరళలో ఆరోగ్య సేవలు ఎక్కువగా ఉచితంగా అందుబాటులో ఉంటే, తెలంగాణలో ప్రజలు భారీ ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణను ”దేశంలో నెంబర్‌వన్ రాష్ట్రం”గా ప్రకటించడం సబబేనా?
సామాజిక న్యాయం పేరుతో ఇచ్చిన హామీలు కూడా అమలు దిశగా కనిపించడం లేదు. దళిత బంధు, బీసీ సబ్‌ప్లాన్, వికలాంగుల పింఛన్లు, మహిళల ఆర్థిక భద్రత, తులం బంగారం, విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఇందులో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలుకాలేదు. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, ఇది సామాజిక న్యాయంపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. రైతు కూలీల కోసం ప్రకటించిన ”ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం కూడా అమలులో విఫలమైంది. సంవత్సరానికి రూ.12వేలు ఇస్తామని చెప్పినా, చాలా మందికి అందలేదు. రబీ, ఖరీఫ్ సీజన్లకు విడతలుగా చెల్లిస్తామని చెప్పినా, రెండు సీజన్లు పూర్తయినా సహాయం అందని పరిస్థితి. ఇది ప్రభుత్వ అమలు సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆటో డ్రైవర్లకు సహాయం, వికలాంగులకు పెన్షన్లు, అలాగే విదేశీ విద్యకు ఆర్థిక సహాయం -ఇలా ప్రతి వర్గానికి ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. వృద్ధులకు, మహిళలకు ఇచ్చిన భరోసా కూడా అమలు కాలేదు. ఇది ప్రజల్లో తీవ్ర నిరాశను నింపుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేరళం వెళ్లి తెలంగాణలో అభివృద్ధి జరిగిందని చెప్పడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవాలు ఒకలా ఉంటే, ప్రసంగాలు మరోలా ఉండడం రాజకీయ నైతికతకు విరుద్ధం. ప్రజాస్వామ్యంలో నాయకులు తమ మాటలకు కట్టుబడి ఉండాలి. లేకపోతే ప్రజల నమ్మకం కోల్పోతారు. తెలంగాణలో లక్షలాది మంది ఇళ్లులేని పరిస్థితిలో ఉన్నారు. నిరుద్యోగం, పేదరికం, అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. కులవివక్ష, హింస తగ్గలేదు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, హామీలు అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ప్రసంగాలు చేయడం ప్రజల సమస్యలను మరుగునపరచే ప్రయత్నం చేయడమే అవుతుంది. కేరళం ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. వారు తమ ఓటు విలువను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటారు. అలాంటి ప్రజలముందు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? రాజకీయ లాభం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రజాస్వామ్యానికి హానికరం. మొత్తానికి, ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితులు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కేవలం ఓట్లకోసం మాత్రమే కాకుండా, ప్రజల జీవితాలను మార్చే బాధ్యతగా భావించాలి. హామీలివ్వడం ఒక రాజకీయ ప్రక్రియలో భాగం కావచ్చు, కానీ, వాటిని అమలు చేయడం ప్రభుత్వ నిబద్ధతను నిరూపించే అసలు ప్రమాణం. లేదంటే ఆ విశ్వాసం క్రమంగా క్షీణించి, భవిష్యత్ రాజకీయ దిశను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది.
మన్నారం నాగరాజు
9550844433



