పొద్దున్నే వార్తలు చూస్తున్నాడు కమల్. పాకిస్తాన్‌పై భారత్ దాడులను ఎదుర్కొలేని పరిస్థితి టీవీల్లో కనబడుతోంది! భారత్ సైనిక పాటవం చాలా స్పష్టంగా కనబడుతున్నది. కమల్ తన కొడుకు బంటిని పిలిచి అవన్నీ చూపిస్తున్నాడు.
అన్నీ చూస్తూ, బంటిగాడు ‘ప్చ్’ అని పెదవి విరిచాడు. తర్వాత టీవీ దగ్గరికి కూడా వెళ్లి చూశాడు. దిగాలుగా వచ్చి తండ్రి వద్ద కూర్చున్నాడు. కొడుకు నిరాశను కమల్ గుర్తించాడు.
”ఏమైందిరా! నిరాశగా ఉన్నావు! మన భారత్ పవర్ చూస్తే సంతోషంగా లేదా?” అని అడిగాడు కమల్.
కాదన్నట్టు తల అడ్డంగా ఊపాడు బంటి.
”మరి ఎందుకు నిరాశగా ఉన్నావు?” మళ్లీ అడిగాడు కమల్.
”నీవు ఎప్పుడూ చెబుతుంటావే నిజమైన హీరోలు ఉన్నారు. అవసరమైనపుడు వాళ్లు దిగుతారు. వాళ్లేమైనా దిగారేమోనని చూస్తున్నా!”అన్నాడు బంటి.
అలా అంటూనే మరోసారి టీవీ ఛానల్ మార్చి మరో ఛానల్‌లో కూడా చూశాడు. కాని బంటికి నిరాశ తప్పలేదు. మళ్లీ నిరాశగా తండ్రి మొహంలోకి చూశాడు.
కొడుకు నిరాశ ఏమిటో కమల్‌కి అర్థం కాలేదు. ఒక పక్క భారత్ దెబ్బకి పాకిస్తాన్ ‘అల్లాహో అక్బర్’ అని అరుస్తోంది. అది చూసి తన కొడుకు ఆనందపడతాడని అనుకుంటే, నిరాశ పడుతున్నాడు. పైగా హీరోలు ఎవరూ దిగలేదు! అంటున్నాడు. తాను ఒక్కొక్కపుడు ఒక్కో హీరో గురించి చెప్పాడు. బంటి కోరుకుంటున్న హీరో ఎవరో తనకు అర్థం కావటంలేదు.
”ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు!” ఆందోళనగా అడిగాడు కమల్.
”అదిగో చూడు! ఆ మురళీనాయక్ యుద్ధంలో చనిపోయాడు. మన తెలుగువాడే కదా! ఏడుపొస్తుంది డాడీ!” అంటూనే ఏడ్చేశాడు బంటి.
కమల్‌కి కూడా బాధేసింది.
”ఇంకా ఎప్పుడొస్తారు డాడీ! నీవుచెప్పిన హీరోలు ఎక్కడున్నారు! యుద్ధంలో మనవాళ్లు చనిపోతుంటే ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు? మనకు మన దేశానికి మన ధర్మానికి ప్రమాదం ఎదురైనపుడల్లా మన హీరోలు వస్తారని నీవు చాలాసార్లు చెప్పావు! కాని ఇంకా ఎవరూరావటం లేదెందుకు డాడీ?” అని అడిగాడు బంటి తండ్రిని కుదిపేస్తూ.
తను చెప్పిన హీరోలెవరూ ఇంకా కమల్‌కి పూర్తిగా గుర్తుకు రావటంలేదు! ఆలోచిస్తున్నాడు.
బంటి పూజగదిలోకి వెళ్లి ఒక జపమాల తెచ్చాడు.
”ఇంకా గుర్తుకు రాలేదా డాడీ! అప్పుడు ఔరంగజేబు మన కాశీని ఆక్రమంచి, మసీదులు కట్టాలని చూస్తే, అఘోరాలు, నాగ సాధువులు లక్షల సంఖ్యలో వచ్చి కాశీని కాపాడుకున్నారని, దాంతో ఔరంగజేబు తోక ముడిచాడని చెప్పావు కదా!” అడిగాడు బంటి.
”అవును నాగసాధువులు ఎంతో శక్తివంతమైనవాడు, ఔరంగజేబు అంతు చూశారు!” అన్నాడు కమల్ ఉత్సాహంగా.
”బ్రిటిష్ వారు మన దేవాలయాలను కూల్చే ప్రయత్నం చేస్తే, ఆఖండాల నుండి వేల కి.మీ. దూరాన్ని కేవలం నిమిషాల్లోనే దాటేసి, బ్రిటిష్ వారిని మన నాగ సాధువులు అడ్డుకున్నారని, బ్రిటష్ వారి తుపాకీగుండ్లను మన నాగ సాధువులు తమ త్రిశూలాలతో తిప్పికొట్టారని, మన నాగసాధువులు ఎనిమిది నుండి పది అడుగుల పొడవు వున్నారని చెప్పావు కదా!” అడిగాడు బంటి.
”అవును నాగసాధువులు అంటే ఏమనుకున్నావు? వారిని బుల్లెట్లే కాదు, మిస్సైళ్లు ఏమీ చేయలేవు. సూక్ష్మ రూపంలో ఎంత దూరమైనా క్షణాల్లోనే చేరుకోగలరు! వారిని ఆపటం బ్రహ్మతరం కూడా కాదు!” అన్నాడు పట్టరానంత ఉత్సాహంతో.
బంటికి కూడా ఊపువచ్చి గట్టిగా చప్పట్లు కొట్టాడు.
”అవును డాడీ! అప్పటి నుండీ నేను అడుగుతున్న హీరోలు వాళ్లే! పాకిస్తాన్‌కి వారే కరెక్టు. వాళ్లెపుడు వస్తారా అని ఎదురు చూస్తున్నా!” అన్నాడు బంటి.
”వాళ్లు ఇప్పుడు రావల్సిన అవసరం లేదురా!” అన్నాడు కమల్.
”ఎందుకు లేదు డాడి?” అడిగాడు బంటి.
”మన ధర్మాలకి ప్రమాదం వస్తే మనం పిలవకుండానే వారు వస్తారు!” అన్నాడు కమల్ నమ్మకంగా.
”ఇది ప్రమాదం కాదా డాడీ! పహల్గాంలో వాళ్లు చంపింది హిందువులనే! మనది హిందూ దేశమేనని, మన వేదాల్లో ఉందని ఎన్నిసార్లు నీవు చెప్పావు! మన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు హిందువులే! మన మోడీ తాత ఉన్న కాలంలోనే పాకిస్తాన్ ఎక్కువసార్లు దాడి చేసిందని నీవు చెప్పావు! అంటే మనధర్మం ప్రమాదంలో ఉన్నట్లే కదా! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డాడీ!” అడిగాడు బంటి.
కమల్‌కి ఏం చెప్పాల్ తోచటం లేదు!.
”పాకిస్తాన్ మీద దాడి మనం చేస్తున్న ఎటాక్‌లో డ్రోన్స్, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు వాడుతున్నారు కదా! వాటికోసం వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నది కదా ! అన్నింటిని మించి యుద్ధంలో మురళీ లాంటి వారు చనిపోతున్నారు కదా! ఇంత అవసరమా! అదే నాగసాధువులు దిగితే చాలు! ఈజీగా పైసా ఖర్చు లేకుండా, ఒకరి ప్రాణం కూడా పోకుండా మనం పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పవచ్చు.అందుకే వాళ్లు రావాలి! వారు రాకపోతే, ఈ జప మాలతో వారిని ఆహ్వానించు! ఇప్పుడు వారు వచ్చి పాకిస్తాన్ సంగతి తేల్చకపోతే, వారి శక్తులు, సూక్ష్మరూపాలు, సెకన్లలో వేల కి.మీ ప్రయాణం చేయటం బుల్లెట్లకి దొర క్కుండా యుద్ధం చేయటం అంతా వేస్ట్!” అంటూ కుంభమేళాలో తెచ్చిన జపమాల తండ్రి చేతిలో పెట్టాడు బంటి.
హీరోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES