నవతెలంగాణ-హైదరాబాద్: జన్ జడ్ నిరసనలతో నేపాల్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) బలగాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలోని గౌరిఫంటా సరిహద్దు వద్ద భద్రతా దళాలు పోలీసు పోర్టును ఏర్పాటు చేశారు. నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు. అయితే, పొరుగు దేశంలోని భారతీయుల్ని మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు. అదేవిధంగా నేపాల్ కూడా భారతీయుల్ని తమ భూభాగంలోకి అనుమతించడం లేదు. సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూగబోయాయి. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని పానిటాంకి సరిహద్దు పట్టణంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో వస్తువులు సరఫరా చేసే ట్రక్కులు బార్డర్ వద్ద చిక్కుకుపోయాయి.