Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుసాదా బైనామాలకు హైకోర్టు గ్రీన్‌ సిగల్‌

సాదా బైనామాలకు హైకోర్టు గ్రీన్‌ సిగల్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ : రాష్ట్రంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు కోర్టు అనుమతించింది. కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ అంశం పొందుపరిచినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన ధర్మాసనం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అంగీకరిస్తూ కేసు విచారణను ముగించింది. సాదాబైనామా క్రమబద్ధీకరణ నిమిత్తం ఐదేండ్ల క్రితం రాష్ట్ర సర్కార్‌ జీవో 112ను జారీ చేయగా, నిర్మల్‌ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్‌ దాన్ని సవాలు చేస్తూ పిల్‌ దాఖలు చేశారు. 2020లో వెలువడిన జీవోను రద్దు చేయాలని కోరగా, అదే ఏడాది నవంబర్‌లో హైకోర్టు స్టే ఇచ్చింది. ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌ 71 రద్దవ్వడంతో భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం చెప్పింది. పాత చట్టం మేరకు వేసిన పిల్‌లోని స్టే ఎత్తివేయాలని కోరింది. ఈ మేరకు అనుబంధ పిటిషన్‌ వేసింది. కొత్త చట్టం నిబంధనలకనుగుణంగా తాము కూడా సవరణ పిటిషన్‌ వేశామనీ, స్టేను కొనసాగించాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, పాత చట్టంలోని నిబంధనలను సవాల్‌ చేసిన పిల్‌ విషయంలో కొత్త చట్ట నిబంధనలకు ఎలా ఉత్తర్వులు కోరతారని ప్రశ్నించింది. గతంలో పలుసార్లు వాయిదాలు తీసుకుని ఇప్పుడు సవరణ పిటిషన్‌ వేయడంలో ఉద్దేశం ఏమిటని కూడా అడిగింది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం వచ్చినందున కొత్తగా పిల్‌ దాఖలు చేసుకోవచ్చునని పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. పాత పిల్‌లోని విషయాలను ఆధారంగా చేసుకుని కొత్త చట్టంలోని అంశాలపై ఉత్తర్వులు కోరడం సబబు కాదని పేర్కొంది. కొత్త అంశాలతో దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను అనుమతి ఇవ్వలేమని వెల్లడించింది. కొత్త చట్టం తీసుకువచ్చిన ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి రైతులకు చెందిన సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గత మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్నాయని చెబుతోందని గుర్తు చేసింది. పాత చట్టం మేరకు దాఖలైన పిల్‌ విచారణ కొనసాగింపు వ్యర్థమని స్పష్టం చేసింది. దీంతో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవరోధాలు తొలగిపోయాయి. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ జీఎం.మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. పిల్‌పై విచారణను కొనసాగించేందుకు నిరాకరించింది. ఇకపై విచారించాల్సిన అవసరం లేదని తెలిపింది. పాత చట్టానికి బదులుగా వచ్చిన కొత్త చట్ట నిబంధనలను కూడా సవాల్‌ చేస్తూ పిల్‌ను సవరిస్తూ అనుబంధ అఫిడవిట్‌ వేశామన్న పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించింది. కొత్త చట్ట నిబంధనలపై పిటిషన్‌ వేసుకోవచ్చునని హితవు చెప్పింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ జీవోను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిల్‌ను గతంలో విచారించిన హైకోర్టు, క్రమబద్ధీకరణకు జీవో అమలును నిలిపివేస్తూ… 2020 నవంబర్‌ 11న మధ్యంతర స్టే ఇచ్చింది. కొత్త చట్టం తెచ్చామనీ, గతంలోని స్టేను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతోపాటు ప్రధాన పిటిషన్‌లను కలిపి బెంచ్‌ విచారణ జరిపి తుది ఉత్తర్వులను వెలువరించింది.
సర్కార్‌తో ఏకీభవించిన హైకోర్టు
సాదా బైనామాల క్రమబద్ధీకరణ విషయంలో అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. 2014కు ముందు 12 ఏండ్లుగా సాదా బైనామాల కింద కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ప్రభుత్వ గడువు మేరకు సుమారు 9.25 లక్షల అప్లికేషన్లు ప్రభుత్వానికి అందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తీసుకువచ్చిందనీ, ఇందులో సెక్షన్‌ 6 ప్రకారం 2014కు ముందు 12 ఏండ్ల పాటు భూమి స్వాధీనంలో ఉన్నవారికి క్రమబద్ధీకరణ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ అడ్వకేట్‌ ప్రభాకర్‌ వాదిస్తూ, పాత చట్టంలోని నిబంధనల మేరకు పిల్‌ వేసిన మాట వాస్తవమేననీ, అయితే, ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూభారతి చట్ట నిబంధనను కూడా సవాలు చేస్తూ సవరణ పిటిషన్‌ వేసినట్టు చెప్పారు. పిల్‌ను విచారించాకే తుది ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పాత చట్టం బదులు కొత్తచట్టంలోని నిబంధన వచ్చిందని ప్రభుత్వం చెప్పి స్టే ఎత్తివేయాలని కోరడం చెల్లదన్నారు. సవరణ పిటిషన్‌లోని అంశాలను పరిశీలిస్తే స్టే ఎత్తివేయాల్సిన అవసరం లేదన్నారు. సవరణ పిటిషన్‌పై వాదనలకు అనుమతి ఇవ్వాలని కోరారు. కొత్త చట్టంలో కూడా పాతదరఖాస్తులను మాత్రమే అనుమతిస్తున్నారని చెప్పారు. కొత్తవాటిని తీసుకోకపోవడం వివక్ష కిందకే వస్తుందన్నారు. కొత్తగా పిల్‌ దాఖలు చేస్తామనీ, కనీసం వారం రోజుల వరకు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు పిల్‌పై విచారణ అవసరం లేదని చెప్పి గతంలోని స్టేను ఎత్తి వేసింది. హైకోర్టు చారిత్రాత్మక తీర్పుతో రాష్ట్రంలో సుమారు 9,00,894 మంది రైతులకు మేలు జరగడంతో పాటు దాదాపు 10 లక్షల ఎకరాల భూములకు 13-బి ప్రొసీడింగ్స్‌ జారీ కానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే తెలంగాణలో చాలా వరకు భూ వివాదాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad