Saturday, July 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపైకేసు కొట్టేసిన హైకోర్టు

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపైకేసు కొట్టేసిన హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 2021లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. రేషన్‌కార్డుల పంపిణీని అడ్డుకున్నారనే కేసులో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. దీనిని 2024లో ప్రజా ప్రతినిధుల కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు కొట్టేయాలంటూ రాజగోపాల్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే హౌదాలో ఆ కార్యక్రమానికి పిటిషనర్‌ వెళ్లారనీ, రేషన్‌ కార్డుల పంపిణీని అడ్డుకున్నారనే ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొన్నారు.
శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ
ఓఎంసీ కేసు ఆరవ నిందితురాలైన ఐఏఎస్‌ ఆఫీసర్‌ వై.శ్రీలక్ష్మి (ఉమ్మడి ఏపీలో పరిశ్రమల కార్యదర్శిగా ఉండగా) నమోదైన కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. సీబీఐ కోర్టులో విచారణను ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. గతంలో డిశ్ఛార్జి పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో ఆమెకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మూడు వారాల్లో విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ పూర్తి చేసి శుక్రవారం తీర్పు చెప్పారు. సీబీఐ చెబుతున్న అభియోగాలకు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని, ఆమె నిందితురాలేనని స్పష్టం చేశారు. .
హెచ్‌సీఏ లీగ్‌మ్యాచ్‌ పర్యవేక్షణకు ఏకసభ్య కమిటీ
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరగనున్న 2024-26 లీగ్‌ మ్యాచ్‌ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావుకు అప్పగిస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. హెచ్‌సీఏ ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ సఫిల్‌గూడ క్రికెట్‌ అసోసియేషన్‌ వేసిన వ్యాజ్యాన్ని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారించారు. తదుపరి విచారణ ఈనెల 28వ తేదీన జరుపుతామనీ, అప్పటి వరకు సెలక్షన్‌ కమిటీని ఎంపిక చేయరాదని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను ఆదేశించారు.
చీఫ్‌ జస్టిస్‌కు సత్కారం
తెలంగాణ హైకోర్టుకు ఏడవ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ను హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ శుక్రవారం సత్కరించింది. హెచ్‌సీఏ అధ్యక్షులు జగన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. చీఫ్‌ జస్టిస్‌ ప్రసంగిస్తూ లాయర్ల సహకారం లేకుండా ప్రజలకు న్యాయం అందించలేమన్నారు. తాను కూడా లాయర్‌గా చేశాకే జడ్జిని అయ్యానని చెప్పారు. అడ్వొకేట్ల సహకారంతో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ ఎ.నరసింహారెడ్డి, పలువురు న్యాయమూర్తులు, హెచ్‌సీఏ నాయకులు పాల్గొన్నారు.
రోహిత్‌ షిండేపై దర్యాప్తు చట్ట ప్రకారం ఉండాలి : పోలీసులకు హైకోర్టు ఆదేశం
ఆదిలాబాద్‌ జిల్లా భుక్తాపూర్‌లో రోహిత్‌ షిండే అనే వ్యక్తిపై నమోదైన కేసుల్లో చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్న తన భర్త రోహిత్‌ షిండేపై పోలీసులు తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ భార్య స్వాతి షిండే పిటిషన్‌ వేశారు. దీనిని జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ శుక్రవారం విచారించి దర్యాప్తు చట్ట ప్రకారం ఉండాలని పోలీసులకు తేల్చి చెప్పారు. హౌంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఎస్‌హెచ్‌ఓలకు నోటీసులు జారీ చేశారు. తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను 3 వారాలకు వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -