నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ గురువారం వెనుకబడిన కులసంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.
ఈక్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.


