నవతెలంగాణ – చిన్నకోడూరు: రైతులు పంట సాగులో నానో యూరియాను వాడితే అధిక లాభాలు పొందవచ్చని, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలను పండించాలని రాష్ట్ర ఇఫ్ కో డైరెక్టర్ మార గంగారెడ్డి అన్నారు. నానో దత్తత గ్రామమైన ఎల్లమ్మ జాలులో గ్రామ సర్పంచ్ వంకాయల రేఖ ఆధ్వర్యంలో ఇఫ్ కో నానోరైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇఫ్ కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, సీనియర్ జనరల్ మేనేజర్ సంజయ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయంలో నూతన సాంకేతికతలను అవలంబిస్తూ దిగుబడులు పెంచుకోవాలన్నారు.భూమి సారాన్ని కాపాడుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. నానో యూరియా వినియోగంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చని పిలుపునిచ్చారు. నానో యూరియా వినియోగం ద్వారా తక్కువ పరిమాణంలోనే అధిక ఫలితాలు సాధ్యమవుతాయన్నారు.
పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలను సమర్థవంతంగా అందించవచ్చని వివరించారు. ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందన్నారు. రైతులు నానో ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, శాస్త్రీయ విధానాలతో సాగు చేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి,పద్మ, కృప శంకర్, వ్యవసాయ శాస్రవేత్త డాక్టర్ పల్లవి, ఇఫ్ కో జిల్లా మేనేజర్ చంద్రబాబు నాయుడు, మండల వ్యవసాయాధికారి జయంత్ కుమార్, ఎఫ్ పిఓ చైర్మన్ ఏలేటి వెంకట్ రెడ్డి, నాగిరెడ్డి, ఆయా గ్రామాల ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



