Friday, May 9, 2025
Homeఆటలుధర్మశాలలో హైటెన్షన్‌!

ధర్మశాలలో హైటెన్షన్‌!

- Advertisement -

– పంజాబ్‌, ఢిల్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌ రద్దు
– భద్రతా కారణాలతో స్టేడియం బ్లాక్‌అవుట్‌
– ధర్మశాల (హిమాచల్‌ ప్రదేశ్‌)

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దు ఉద్రిక్తల ప్రభావం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై పడింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌తో ఉగ్రమూకల స్థావరాలపై మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్‌ సింధూర్‌కు బదులుగా పాకిస్థాన్‌ సైన్యం గురువారం ప్రతీకార చర్యలకు దిగింది. జమ్మూలో పౌరులే లక్ష్యంగా పాకిస్థాన్‌ సైన్యం దాడులకు దిగింది. వైమానిక దాడుల ప్రమాదం నేపథ్యంలో జమ్మూలో బ్లాక్‌అవుట్‌ పాటించారు. ఈ ప్రభావం హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో కనిపించింది. ధర్మశాలలో గురువారం పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ పాక్‌ దాడుల నేపథ్యంలో అర్థాంతరంగా నిలిచిపోయింది. స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురు వైమానిక దాడుల్లో మన ఉనికిని తెలియజేసే ప్రమాదం నేపథ్యంలో తొలుత విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. స్టేడియంలోని ప్రజలకు అవగాహన కల్పించి.. ఓ గేట్‌ నుంచి మాత్రమే అందరినీ బయటకు పంపించారు. పంజాబ్‌, ఢిల్లీ జట్ల ఆటగాళ్లను సైతం సురక్షితంగా న్యూఢిల్లీకి చేర్చే బాధ్యత సైన్యం తీసుకుంది. రైలు మార్గంలో క్రికెటర్లను దేశ రాజధానికి చేర్చే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 10.1 ఓవర్లలో 122/1 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (50 నాటౌట్‌), ప్రియాన్షు ఆర్య (70) అర్థ సెంచరీలతో రాణించారు. భద్రతా కారణాలతో మ్యాచ్‌ రద్దు కావటంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది.
ఆ మ్యాచ్‌ వేదిక మారింది : భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలు, ఆపరేషన్‌ సింధూర్‌ ప్రభావం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై పడింది. ముంబయి, పంజాబ్‌ మ్యాచ్‌ను ధర్మశాల నుంచి అహ్మదాబాద్‌కు మార్పు చేశారు. తొలుత ముంబయిలో నిర్వహించాలనే ఆలోచన చేసినా.. ఆ జట్టుకు సొంత గడ్డ ప్రయోజనం చేకూరుతుందని అహ్మదాబాద్‌ను ఎంపిక చేసుకున్నారు. ధర్మశాల నుంచి న్యూఢిల్లీకి రోడ్డు మార్గంలో చేరుకోనున్న పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు అక్కడ్నుంచి విమానంలో అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. న్యూఢిల్లీ సమీపంలోని ఐపీఎల్‌ వేదిక కాగా.. ఆదివారం అక్కడ మ్యాచ్‌ ఉండటంతో అహ్మదాబాద్‌లో నిర్వహణకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఐపీఎల్‌ నిర్వాహకులు గురువారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. వేదిక మారినా.. మ్యాచ్‌ సమయంలో ఎటువంటి మార్పు లేదు. మధ్యాహ్నం 3.30 గంటలకే పంజాబ్‌, ముంబయి జరుగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -