నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్-ఐరోపా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగినట్లుగా ప్రధాని మోడీ వెల్లడించారు. మంగళవారం గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్- 2026ను మోడీ వర్చువల్‌గా ప్రారంభించి ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. సోమవారం భారత్-ఈయూ మధ్య ప్రధాన ఒప్పందంపై సంతకాలు జరిగాయని.. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.
దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత జనవరి 27న భారత్-ఈయూ సమ్మిట్‌లో భారతదేశం-యూరోపియన్ యూనియన్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. సమ్మిట్‌కు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సహ అధ్యక్షత వహించారు.
ఈ భారీ ఒప్పందం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తయారీ రంగాన్ని.. సేవలను పెంచుతుందని ప్రధాని మోడీ అన్నారు. రెండు వైపులా వ్యాపారాలు.. ప్రజలకు ప్రధాన అవకాశాలను సృష్టిస్తుందని మోడీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు-యూరోపియన్ దేశాలలోని మిలియన్ల మంది ప్రజలకు అద్భుతమైన అవకాశాలను తెస్తుందని చెప్పారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి ఈ ఒప్పందం ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పారు. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తుందని వెల్లడించారు. ఇది వాణిజ్యం పట్ల మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యం, చట్ట పాలన పట్ల కూడా ఉమ్మడి నిబద్ధతను బలపరుస్తుందని తెలిపారు.



