– ప్రతి పదినిమిషాల్లో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలుస్తున్న వైనం
– ప్రమాదం జరిగాక భయంతో పారిపోతున్న వాహన చోదకులు
– రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
– కేసుల దర్యాప్తులో పోలీసుల ఉదాసీనత
– వీఐపీ ఐతేనే…కేసుల్లో పురోగతి
– బాధితులకు అందని న్యాయం
న్యూఢిల్లీ : ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాలను వీధిన పడేస్తుంది. ప్రమాదంలో క్షతగాత్రులు, మృతులు, ప్రమాదానికి కారకులైన వారూ అందరూ దీనిలో బాధితులే. దేశంలో ప్రజారవాణాను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తుండటంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే దానికి తగినట్టు భారతదేశ రహదారులు లేవనేది అక్షరసత్యం. గంటకు 200 కి.మీ., వేగంతో వెళ్లే కార్లు, బైకుల్ని ఈ రోడ్లపైకి అనుమతిస్తున్నారు. ఆ బైక్‌రైడింగ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం తన బాధ్యత ఏమీ లేనట్టే వ్యవహరిస్తుంది. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్‌కు చెందిన టెస్లా వై వంటి కార్లు భారత రోడ్లపైకి వచ్చేశాయి. ఆ కార్లు తిరిగే విధంగా మనదేశ రహదారులు ఉన్నాయా లేవా అనేదానిపైనా చర్చ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నెంబర్ వన్ స్థానంలో భారతదేశమే ఉందని అనేక సర్వేలు చెప్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం, ప్రమాద కారకులకు తక్షణ భద్రత వంటి అనేక విషయాలపై దేశ ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయి. మితిమీరిన వేగం, మద్యం, మత్తు పదార్థాలు సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి కేసుల్లో నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందే. అదే సమయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు సక్రమంగానే పాటిస్తున్నా, అనుకోని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతున్నవారిపట్ల ప్రజలు దురుసుగా ప్రవర్తిస్తుండటంతో ‘హిట్ అండ్ రన్’ కేసుల సంఖ్య పెరిగి, కనీస మానవత్వం లోపిస్తోంది. దీనివల్ల తక్షణ వైద్య సహాయాన్ని బాధుతులు కోల్పోతున్నారు.
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రమాదంలో చావుబతుకుల మధ్య ఊగిసలాడుతూ రక్తపు ధారలతో రహదారులపై పడి ఉన్న బాధితులను వారి మానాన వదిలేసి తమకేమీ పట్టనట్టుగా ప్రజలు సాగిపోతున్న దృశ్యాలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరైతే బాధితులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలన్న కనీస జ్ఞానం కూడా లేకుండా సెల్‌ఫోన్లలో ప్రమాద దృశ్యాలను చిత్రీకరిస్తుంటారు. వారి సంగతి ఎలా ఉన్నప్పటికీ, ప్రమాదాలకు కారణమైన వాహన చోదకులు కూడా బాధితులను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి పారిపోతున్నారు.
దీనికి కారణాలు అనేకం. కోపోద్రిక్తులైన ప్రజలు తమను చావచితకబాదుతారేమోనన్న భయం, పట్టుబడితే శిక్ష తప్పదనే ఆందోళనతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. 2022లో ‘హిట్ అండ్ రన్’ రోడ్డు ప్రమాద కేసుల్లో 30,400 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రముఖులు చనిపోతే…
‘హిట్ అండ్ రన్’లో సామాన్యుల ప్రాణాలు పోతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించే పోలీసులు, ఎవరైనా ప్రముఖులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మాత్రం ఎక్కడలేని హడావిడి చేస్తారు. కేసుల్ని లోతుగా విచారణ జరిపి నిందితులను కటకటాల వెనక్కి పంపే స్తారు. ఈనెల 14వ తేదీ లెజెండరీ అథ్లెట్ ఫౌజాసింగ్ (114) తన స్వగ్రామంలో రోడ్డు దాటుతుండగా హిట్ అండ్ రన్ ప్రమాదానికి గురై చనిపోయారు. 114 ఏండ్ల మారథారన్ మరణంపై మీడియాలో వరుస కథనాలు రావడంతో పోలీసులు విచారణ చేపట్టి, వాహన డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఫౌజాసింగ్ మరణించిన జలంధర్ గ్రామీణ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలోకల ఇదూ హిట్-అండ్-రన్ కేసుల్లో 117 మంది చనిపోయారు. ఆ కేసులు మాత్రం అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రోడ్డుప్రమాద మరణాల్లో 49 శాతం హిట్-అండ్-రన్ కేసులకు సంబంధించినవే కావడం గమనార్హం.
ఏటా పెరుగుతున్న ప్రమాదాలు
ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు భారతదేశంలోనే జరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2021లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 17 శాతం పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో దేశంలో 1.68 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దేశంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య 2018 నుంచి 2022 మధ్యకాలంలో పెరుగుతూ వస్తోంది. కోవిడ్ కారణంగా 2020లో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గినా, ఆ తర్వాత మళ్లీ పూర్వ స్థాయిని చేరుకొని, ఇప్పుడు దాన్ని కూడా దాటేసింది. దీనికి లోపభూయిష్టంగా ఉన్న రహదారుల డిజైనింగ్, మౌలిక సదుపాయాల కొరత, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించండంలో వైఫల్యం వంటి అనేక అంశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
న్యాయ పోరాటంలో గెలిచినా…
జాతీయ స్థాయిలో ఈతగాడిగా శిక్షణ పొందుతున్న 16 సంవత్సరాల అక్షరుకుమార్ 2009 మే 5వ తేదీ ఓ వివాహ వేడుకలో నృత్యం చేస్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్ అతనితో పాటు మరోవ్యక్తిని ఢకొీట్టి వెళ్లిపోయింది. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు షరా మామూలుగా హిట్-అండ్-రన్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టలేదు. దీనితో తన కుమారుడిని ట్రక్కుతో ఢకొీట్టి మరణానికి కారకుడైన వ్యక్తిని కనిపెట్టడానికి అక్షరు తండ్రి ఒంటరి పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఆయన న్యాయస్థానాల్లో విజయం సాధించారు. కానీ వ్యవస్థ ఆయన్ని ఓడించింది. బెయిల్‌పై బయటికి వచ్చిన ట్రక్ డ్రైవర్ అతిగా మద్యం సేవించి ఆస్పత్రిలో చనిపోయాడు. దీంతో పోలీసులు 2012లో కేసును మూసేశారు.
పట్టింపు ఏదీ?
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలను గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రమాద సమయంలో ఏం జరిగిందో లుసుకునేందుకు ఎవరూ ప్రయత్నించరు. ఏ సంఘటనలో అయినా వాహన డ్రైవరునే బాధ్యుడిని చేస్తున్నారు. అంతేకానీ సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరు బాధ్యులో ర్ధారించరు. ప్రాణనష్టాన్ని ఎలా తగ్గించాలన్న విషయంపై ఆలోచనే జరగదు. కేసు దర్యాప్తులో ఇబ్బందులు ఎదురవకుండా ఉండడానికి పోలీసులు హిట్-అండ్-రన్ అనే పదాన్ని తరచూ ఉపయోగిస్తూ ఉంటారు.
అరుదైన సందర్భాల్లో నిందితులు దొరికినా డబ్బు చేతులు మారడంతో, నిందితులు సులభంగా తప్పించుకోగలు గుతున్నారనే ఆరోపణలు సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం గగనంగా మారుతుంది.
ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం
దేశంలో రోడ్లను వాహన చోదకులను దృష్టిలో పెట్టుకొనే నిర్మిస్తున్నారే తప్ప, పాదచారులు, సైకిలిస్టులను కాదని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల్లో సంభ విస్తున్న మరణాలు, బాధితులకు తగులుతున్న గాయాలు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. దేశ జీడీపీలో రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న నష్టం 3.14 శాతంగా ఉన్నదని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో పేర్కొంది. ఈ కథనాన్ని చదవడానికి మీకు పది నిమిషాలు పట్టిందను కోండి…. ఈ సమయం లోనే దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసి ఉండవచ్చు!! దీనిపై ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరణాలను నివారించాల్సిన బాధ్యతా ఉంది.