Saturday, July 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆశాజనకంగా వర్షాలు

ఆశాజనకంగా వర్షాలు

- Advertisement -

– పలు జిల్లాల్లో వదలని ముసురు
– ఊపందుకున్న వరి నాట్లు
– ఇలాగే ఉంటే పత్తికి నష్టమంటున్న రైతులు
– ప్రాజెక్టుల్లోకి చేరిన నీరు
– హైదరాబాద్‌లో రాత్రంతా వానలు
నవతెలంగాణ-విలేకరులు

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఆశాజనకంగా ఉన్నాయి. మరోవైపు ముసురు వానలతో రోడ్లు చిత్తడి చిత్తడిగా తయారయ్యాయి. శుక్రవారం భారీగా వర్షాలు లేకపోయినా ముసురు పడింది. హైదరాబాద్‌లో రాత్రి సమయంలో వర్షాలు భయపెడుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో సాగైన 8 లక్షల ఎకరాల పత్తి, కంది, సోయా, పెసర వంటి మెట్ట పంటల పైర్లు పచ్చబడి పైర్లు ఏపుగా పెరిగేందుకు వానలు ఉపయోగపడనున్నాయి. వానలు పడుతుండటం తో దుక్కులు చదును చేసి రైతులు నాట్లు వేస్తున్నారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో వరి నాట్ల పనులు ఊపందు కున్నాయి. నారింజ, సింగూరు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటుంది. ఎగువన కర్నాటక, మహారాష్ట్రతో పాటు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరంతా వాగులు, వంకలు, కాల్వల ద్వారా ప్రాజెక్టుల్లోకి చేరుతున్నాయి. సింగూర్‌ ఇన్‌ప్లో 9500 క్యూసెక్యులుంది. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, రంగనాయకసాగర్‌, మెదక్‌ జిల్లాలోని ఘన్‌పూర్‌, హాల్దీ, పోచారం ప్రాజెక్టుల్లోకి పెద్దగా వరద నీరు రావడంలేదు. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడమే కారణం. ప్రస్తుతం కురుస్తున్న తేలికపాటి వర్షాల వల్ల వానాకాలం పంటల సాగుకు కాస్త ఊరట లభిస్తుంది. అయితే యాసంగిలో పంటల సాగుకు అవసరమైన నీటి లభ్యత ఉండాలంటే భారీ వర్షాలు పడాలి. న్యాల్‌కల్‌, ఝరాసంఘం, మనురు, నాగిల్‌దిద్ద, రామాయంపేట వంటి వంపు ప్రాంతాల్లో పత్తి చేలల్లో నీరు నిల్వ ఉండటంతో పైర్లు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం స్వల్పంగా పెరుగుతూ వస్తుంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 21 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం 12 గంటలకు 23.50 అడుగులు, సాయంత్రం 6గంటలకు 25.8 అడుగులు, 8 గంటలకు 26.3 అడుగులకు నీటిమట్టం పెరిగి ప్రవహిస్తోంది. 2,57,086 క్యూసెక్కుల నీరు దిగువకు తరలివెళ్ళింది. భద్రాచలం ఏజెన్సీ చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరడంతో ఒక గేటు రెండు అడుగుల మేర, 6 గేట్లు పూర్తిగా ఎత్తి 24,905 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి అధికారులు విడుదల చేశారు. ఖమ్మంలోని మున్నేరు వాగుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

పాకాల నీటి మట్టం 23.5అడుగులు
వరంగల్‌ జిల్లా పాకాల సరస్సు నిండుకుండలా మారి మత్తడి సమీపంలో ఉంది. వరద నీరు భారీగా చేరుకోవడంతో ప్రస్తుతం 23.5 అడుగులకు చేరుకుంది. పూర్తి సామర్థ్యం 30.1 అడుగులు. మాదన్నపేట పెద్ద చెరువు 17 అడుగులకు గాను 13 అడుగుల నీటిమట్టానికి చేరుకున్నది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కి భారీ వరద నీరు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం 3,41,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దాంతో 85 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. మేడిగడ్డ పూర్తి స్థాయి నీటి మట్టం 100 మీటర్లు కాగా ప్రస్తుతం 92.70 మీటర్లుగా ఉంది. కాళేశ్వరం వద్ద గోదావరి 8.300 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దాంతో లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

జూరాల నుంచి కిందికి నీరు విడుదల
మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యల్పంగా వర్షపాతం నమోదయ్యింది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణ, బీమా, తుంగభద్ర నదులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో శ్రీశైలం, జూరాల గేట్లను మరోసారి గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానదికి నీటి ప్రవాహం పెరగడంతో జూరాల 12 గేట్లను తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. రిజర్వాయర్‌లోకి 45వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా బయటకు 4080 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -