నవతెలంగాణ – హైదరాబాద్: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది మరణించగా, ఒక్క ప్రయాణికుడు మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాశ్ కుమార్ రమేశ్ తాను ఎలా రక్షించబడ్డాడో వివరించారు. విశ్వాశ్ కుమార్ విమానంలో 11ఏ నంబర్ సీటులో ఎడమవైపున ఉన్న అత్యవసర ద్వారం పక్కన కూర్చున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గాల్లోనే ముక్కలైపోయిందని, తన సీటు విమానం నుంచి విడిపోయి దూరంగా ఎగిరిపడిందని ఆయన తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్ వైద్యులతో మాట్లాడుతూ “విమానం ముక్కలైంది, నా సీటు ఊడివచ్చింది. అలా నేను ప్రాణాలతో బయటపడ్డాను” అని చెప్పారు. విమానం ఛిద్రమైనప్పుడు తాను సీటు బెల్టుతో ఉండగానే బయటకు విసిరివేయబడ్డానని, అంతేగానీ తాను దూకలేదని ఆయన స్పష్టం చేశారు. గాయాలతో బయటపడ్డ ఆయన ప్రస్తుతం ట్రామా వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
మృత్యుంజయుడు ఎలా బయటపడ్డాడంటే..!
- Advertisement -
- Advertisement -



