Wednesday, May 7, 2025
Homeజాతీయంసుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులెన్ని?

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులెన్ని?

- Advertisement -

– వెబ్‌సైట్‌లో 33 మందిలో 21 మంది వివరాలు
– ఇంకా వెల్లడించని 12 మంది జడ్జీలు
న్యూఢిల్లీ:
న్యాయవ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా.. జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరా లను సర్వోన్నత న్యాయస్థానం తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. దీని ప్రకారం.. వారి ఆస్తుల వివరాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు రూ.55.75 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, రూ.14,000 విలువైన షేర్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో రూ.1.06 కోట్లు, రూ.1.2 కోట్ల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, రూ.29,625 ఎల్‌ఐసీ మనీ బ్యాక్‌ పాలసీ వార్షిక ప్రీమియం, దక్షిణ ఢిల్లీలో ఫ్లాట్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌ విలేజ్‌లో 2,446 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ అపార్ట్‌మెంట్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని డల్హౌసీలో ఇల్లు ఉన్నాయి. చరాస్తుల్లో 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, మారుతి స్విఫ్ట్‌ కారు ఉన్నాయి.
తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ బి.ఆర్‌.గవారుకి బ్యాంకులో రూ.19.63 లక్షల నగదు, రూ.5.25 లక్షల విలువైన బంగారు ఆభర ణాలు, మహారాష్ట్రలోని అమరావతిలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు, ముంబయిలోని బాంద్రా, ఢిల్లీలోని డిఫెన్స్‌ కాలనీల్లో అపార్ట్‌మెంట్‌లు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన సతీమణి వద్ద రూ.29.70 లక్షల విలువైన ఆభరణాలు, రూ.61,320 నగదు డిపాజిట్‌ ఉన్నాయి.
8 ఈ ఏడాది నవంబర్‌ 24న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్‌ సూర్యకాంత్‌కు చండీగఢ్‌లో ఒక ఇల్లు, పంచకులలో 13 ఎకరాల వ్యవసాయ భూమి, గురుగ్రామ్‌లో ఇంటిస్థలం, రూ.4.11 కోట్ల విలువైన స్థిర డిపాజిట్లు, 100 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు, మూడు విలువైన గడియారాలు ఉన్నాయి.
8 జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌కు రూ.120 కోట్లకు పైగా పెట్టుబడులు, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, గుల్‌మోహర్‌ పార్క్‌లో పలు ఆస్తులు, తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక అపార్ట్‌మెంట్‌ ఉన్నాయి. 2010-11 నుంచి 2024-25 వరకు ఉన్న రూ.91.47 కోట్లకు పైగా ఆదాయపు పన్ను వివరాలను ప్రకటించారు.
వెబ్‌సైట్‌లో న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటనే కాకుండా హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ, హైకోర్టు కొలీజియానికి అప్పగించిన బాధ్యతల వివరాలు సహా ఇతర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో ఇటీవల భారీ మొత్తంలో నగదు లభ్యమైందన్న ఆరోపణలు న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై అనుమానాలు రేపిన నేపథ్యంలో న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -