Tuesday, April 29, 2025
Navatelangana
Homeఎడిట్ పేజిట్రంప్‌ సుంకాల దాడికి ఇండియా ఎలా స్పందించాలి?

ట్రంప్‌ సుంకాల దాడికి ఇండియా ఎలా స్పందించాలి?

- Advertisement -

తాను ప్రతిపాదించిన సుంకాల హెచ్చింపును ట్రంప్‌ తొంభై రోజులపాటు వాయిదా వేశాడు. ఇండియా, ఇతర దేశాలు వెంటనే ట్రంప్‌ సుంకాల దాడికి స్పందించనవసరం లేదనుకున్నా, తొంభైరోజుల తర్వాతనైనా స్పం దించాలి కదా. ఇదేమీ ముగిసిపోయిన కథ కాదు. తనకు నచ్చిన విధంగా నడుచుకోని ఏ దేశం మీదనైనా సుంకాలను అధికంగా విధిస్తానని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. అమెరికా ఆధిపత్యాన్ని చెలాయించడానికి సుంకాల పెంపును ఒక ఆయుధంగా వాడుతున్నాడు. మరోపక్క అలా పెంచిన సుంకాల ద్వారా తన దేశంలో ఉత్పత్తి కార్యకలాపాలను పెంచుకోడానికి, అమెరికా వ్యాపార లోటును తగ్గించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం ఇప్పుడు ప్రపంచ పెట్టుబడి దారీ వ్యవస్థలో ఒక కొత్త దశను చూస్తున్నాం. పరిస్థితి అంతా సజావుగానే ఉన్నట్టు ఇండియా వంటి దేశాలు గనుక నటించడానికి పూనుకుంటే అంతకన్నా అర్ధం లేని విషయం ఇంకొకటి ఉండదు. ఇక్కడ విధానాలను యథావిధిగా కొనసాగించేద్దాం అని ఇండియా భావిస్తున్నట్టు ఉంది. ఇప్పుడు కొనసాగిస్తున్న విధానాలు దేశంలోని శ్రామిక ప్రజా నీకానికి చాలా కష్టాలను తెచ్చిపెట్టాయి. ఆ విధానాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకున్న రోజుల్లోనే శ్రామిక ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు తాజా పరిస్థితిలో కూడా ఆ విధానాలనే కొనసాగిస్తే దాని వలన వారు మరింత ఎక్కువగా కష్టాలపాలౌతారు.అంతేగాక, అమెరికన్‌ సామ్రాజ్యవాద పెత్తనానికి మనం మరింతగా తలొగ్గవలసి వస్తుంది.
”యథావిధిగా వ్యాపారం” అంటే ప్రపంచ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోందని, దాని నుండి పూర్తి ప్రయో జనాన్ని పొందడానికి ఇండియా వంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను నిబంధనలు లేని స్వేచ్ఛా వ్యాపారానికి అను మతించాలని, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మీద నియంత్రణ కొనసాగించకూడదని అర్ధం. నయా ఉదారవాద విధా నాలను ప్రవేశపెట్టిన సమయంలో చెప్పినది ఇదే. ఈ వాదన శుద్ధ తప్పు, అమెరికాలో హౌసింగ్‌ బుడగ పేలిపోయిన ప్పుడే ఆ సంగతి స్పష్టం అయిపోయింది. ఇప్పుడు ట్రంప్‌ ప్రదర్శిస్తున్న తెంపరితనం స్వేచ్ఛా వ్యాపారం అనేది వట్టి బోగస్‌ వాదన అని మరీ స్పష్టంగా తేల్చేసింది. నయా ఉదారవాద విధానాలు భారతదేశ ప్రజానీకపు జీవితాలకు, మన దేశ స్వాతంత్య్రానికి వినాశనకరంగా పరిణమించాయన్న వాస్తవాన్ని ఇప్పుడైనా గ్రహించకపోవడం అంటే అది చాలా ప్రమాదకరం.
నయా ఉదారవాద విధానాలను బలపరుస్తున్న కొందరు వాదిస్తున్న తీరు ఇలా ఉంది: ఇప్పుడు అమెరికా, చైనాల నడుమ సుంకాల యుద్ధం నడుస్తోంది గనుక, ఇకముందు కాలంలో వారిద్దరి మధ్యా వాణిజ్యం కొనసాగే అవకాశం లేదు కనుక, అమెరికాతో వాణిజ్యం నడపడానికి చైనా స్థానాన్ని భారతదేశం తీసుకోవాలి. ఈ వాదనను మాట వరసకు ఒప్పుకుందాం. ఇప్పుడు అమెరికాతో వాణిజ్యాన్ని నడపాలంటే మన దేశం ట్రంప్‌ను సంతృప్తిపరచాలి. అప్పుడు మన దేశం నుండి ఎగుమతులు అమెరికాకు తాత్కాలికంగానైనా పెరగవచ్చు. అయితే, ఇప్పుడు ట్రంప్‌ సాగిస్తున్న యుద్ధం చైనాను తన వాణిజ్య భాగస్వామిగా ఉండకుండా చేయడానికి కాదు. అమెరికాకు వాణిజ్యంలో ప్రస్తుతం ఉన్న లోటును తగ్గించుకోవడం ట్రంప్‌ లక్ష్యం. అంటే తాత్కాలికంగా చైనాకు బదులు మనం అమెరికాతో సాగించే వాణిజ్యం ఎంతో కాలం పాటు కొనసాగే అవకాశం లేదు.
అయినప్పటికీ, తాత్కాలికంగానైనా ప్రయోజనం పొందాలంటే మనం చైనా స్థానాన్ని అక్రమించడానికి తాపత్రయపడే ఇతర దేశాలతో పోటీ పడాలి. ఆ దేశాలతో పోటీ పడి మన రూపాయి విలువను తగ్గించుకోవాలి. ఇప్పటికే మన రూపాయి మారకపు విలువ క్షీణిస్తోంది. అది మరింత హీన స్థాయికి చేరుతుంది. అది కూడా మనం ట్రంప్‌ విధించిన అధిక సుంకాలకు ప్రతిస్పందించకుండా ఉన్నప్పుడు మాత్రమే. అంటే అమెరికా నుండి వచ్చే దిగు మతుల మీద మనం సుంకాలను పెంచకుండా ఉండాలి. ట్రంప్‌ మాత్రం తాను పెంచిన సుంకాలను అలాగే కొన సాగిస్తాడు. దీనివలన మన రూపాయి మారకపు విలువ మరింత పడిపోతుంది. మన నయా ఉదారవాద సమర్ధకుల సలహాను పాటిస్తే జరిగేది ఇదే.
రూపాయి మారకపు విలువ తగ్గిపోతే దాని ఫలితంగా కార్మికుల నిజవేతనాలు పడిపోతాయి. దీన్ని ఒక తేలికపాటి ఉదాహరణతో వివరించవచ్చు: ఒక దేశం రూ.220 విలువగల సరుకులను ఉత్పత్తి చేసిందనుకుందాం. అందులో దిగుమతి చేసుకున్న ఇన్‌పుట్స్‌ విలువ రూ.100 అని, కార్మికుల వేతనాల ఖర్చు రూ.100 అని, రూ.20 పెట్టుబడిదారుడికి మిగిలే లాభం అని అనుకుందాం. ఇప్పుడు రూపాయి మారకపు విలువ పదిశాతం తగ్గిందనుకుంటే దాని ఫలితంగా దిగుమతి చేసుకున్న ఇన్‌పుట్స్‌ విలువ రూ.110 అవుతుంది. కార్మికుల నిజవేతనాల స్థాయిగాని, పెట్టుబడిదారుడి లాభం స్థాయిగాని యథాతథంగా కొనసాగితే అప్పుడు కార్మికుల వేతనాలు రూ.110, పెట్టుబడిదారుడి లాభం రూ.22 అవుతాయి. అప్పుడు ఉత్పత్తి అయిన సరుకు విలువ రూ.242 అవుతుంది. ఇది అంతకు ముందు ఉన్న విలువ కన్నా పది శాతం ఎక్కువ. అయితే ఈ సరుకు విలువ డాలర్లలో లెక్కించినప్పుడు గతంలో ఎంత రేటు ఉండేదో ఇప్పుడూ అంతే ఉండాలి. అలా ఉండాలంటే పెట్టుబడిదారుడి లాభం వాటా కాని, కార్మికుల వేతనాల వాటా కాని లేదా రెండూ కాని తగ్గాలి. పెట్టుబడిదారీ సమాజంలో లాభం ఎంత ఉండాలనేది నిర్ణయించుకునేది పెట్టుబడిదారుడే. కనుక తన లాభాన్ని తగ్గించుకోడు. ఇక మిగిలింది కార్మికుల వేతనాలు మాత్రమే. వాటిని కార్మికులు నిర్ణయించగలిగే స్థితి లేదు. అందుచేత అనివార్యంగా కార్మికుల నిజ వేతనాలు తగ్గి పోతాయి. అదే సుంకాల విషయంలోనైతే వాటిని కొన్ని ఎంపిక చేసిన సరుకుల మీద మాత్రమే విధిస్తారు కనుక దిగుమతి చేసుకునే ఇన్‌పుట్స్‌ మీద సుంకాలను పెంచకపోతే కార్మికుల వేతనాలు తగ్గకపోవచ్చు.
నయా ఉదారవాద సమర్ధకులు ట్రంప్‌ సుంకాలను పెంచినా, మనం పెంచకుండా ఉండాలని, మన రూపాయి మారకపు విలువను తగ్గించుకుని వాణిజ్యాన్ని కొనసాగించాలని అంటున్నారు. అంటే వీరు పరోక్షంగా కార్మి కుల నిజవేతనాలను మరింత తగ్గించాలని సూచిస్తున్నారన్నమాట. ట్రంప్‌ విధించే అధిక సుంకాలకు మూల్యం కార్మి కులు చెల్లించాలని వీరంటున్నారు. ట్రంప్‌ మొత్తంగానే తన దిగుమతులను తగ్గించుకుని తన దేశంలోనే ఉత్పత్తులను పెంచుకోవాలని అనుకుంటున్నది ఆచరణ రూపం దాల్చితే…మనం రూపాయి మారకపు విలువను తగ్గించు కున్నప్పటికీ, మన దేశం నుండి ఎగుమతులు పెద్దగా పెరిగేది ఏమీ ఉండదు. అంటే ఉపాధి అవకాశాలు అదనంగా కలిగేవి ఏమీ ఉండవు. మన రూపాయి విలువను తగ్గించుకుని చౌకగా అమెరికాకు ఎగుమతులు చేసినా, అక్కడ వాటిని కొనేవారు పెరగనప్పుడు ఇక్కడ మన ఉపాధి అవకాశాలు ఉన్నవి కూడా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అమెరికాతో చైనా ఇంతవరకూ సాగించిన వాణిజ్యం స్థానంలోకి చొరబడడానికి ప్రయత్నించే వివిధ దేశాలు తమ తమ కరెన్సీల మారకపు విలువలను తగ్గించుకోడానికి సిద్ధపడినప్పుడు వాటి నడుమ ఒక పోటీ నెలకొంటుంది. అప్పుడు ఇండియా కూడా వాటితో పోటీ పడాల్సి వుంటుంది. ఇలాంటి పోటీలో రూపాయి మారకపు విలువ పడిపో బోతోందని అంచనా వేసే స్పెక్యులేటర్లు ముందుగానే మన దేశం నుండి తమ సంపదను వేరే ప్రాంతాలకు తరలించడం మొదలుపెడతారు. దానివలన రూపాయి విలువ మరింత పడిపోతుంది.అది కార్మికుల జీవితాలను మరింతగా దుర్భరం చేస్తుంది.
నిజానికి ట్రంప్‌ ప్రారంభించిన సుంకాల యుద్ధం నయా ఉదారవాద చట్రం నుండి బయటపడడానికి మన దేశానికి లభించిన ఒక మంచి అవకాశం. ఇప్పుడు ట్రంప్‌ మీద ప్రతిచర్యగా మన సుంకాలను పెంచి, రూపాయి మారకపు విలువను యథాతథంగా కొనసాగించాలి. అమెరికానుండి వచ్చే దిగుమతుల ధరలు పెరిగినందువలన మనదేశంలో వాటి ధరలు పెరుగుతాయి. దాని వలన ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని అదుపు చెయ్యాలంటే రూపాయి విలు వను యథాతథంగా కొనసాగించడం అవసరం. ఒకవేళ విదేశీ చెల్లింపులలో లోటు పెరిగే స్థితి వస్తుందనుకుంటే అప్పుడు వాణిజ్యం మీద, పెట్టుబడుల రాకపోకల మీద నియంత్రణలను విధించాలి. ఈ ప్రతికూల పరిణామాలను తట్టుకోడానికి వీలుగా దేశంలో ఉత్పత్తి కార్యకలాపాలను పెంచాలి. దానితోబాటు ఉపాధి అవకాశాలను పెంచాలి. ఇదంతా జరగాలంటే ప్రభుత్వం తన వ్యయం పెంచాలి. ముఖ్యంగా సంక్షేమ చర్యల మీద వ్యయాన్ని పెంచాలి. ఈ వ్యయానికి కావలసిన అదనపు ధనాన్ని సంపద పన్ను విధించడం ద్వారా సమకూర్చుకోవాలి. అంటే మార్కెట్‌ శక్తుల మీద ప్రభుత్వ నియంత్రణను మళ్ళీ ప్రవేశపెట్టాలి. అంటే నయా ఉదారవాద విధానాలకు స్వస్తి చెప్పాలి.
మళ్ళీ ప్రభుత్వ నియంత్రణ తేవాలి అనగానే మన నయా ఉదారవాద సమర్ధకులు వణికిపోతారు. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌, తదితర సంస్థల ప్రభావం, గుత్త పెట్టుబడిదారుల అధీనంలో ఉన్న మీడియా ప్రభావం ఎంత ఎక్కు వగా ఉందంటే సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉండే విశానానికి వెనక్కి మళ్లాలనగానే వారు విముఖతను ప్రదర్శిస్తారు. ఇక్కడ మూడు విషయాలను స్పష్టం చేయాలి.
మొదటిది: ప్రభుత్వ నియంత్రణ ఉన్న వ్యవస్థలో అభివృద్ధి అనేది ముఖ్యంగా వ్యవసాయంలో సాధించే వృద్ధి మీద ఆధారపడి వుంటుంది. కాని నయా ఉదారవాద విధానాల వలన వ్యవసాయం లో వృద్ధి లేకుండా పోయింది. వ్యవసాయ రంగానికి ఊపిరి సలపకుండా చేసేశారు. ఇప్పుడు సరైన చర్యలు చేపడితే వ్యవసాయ రంగం పునరుజ్జీవనం పొంది లాభాల బాటలో నడవడమే కాకుండా గతంలో సాధించలేకపోయిన ఉన్నత స్థాయికి కూడా చేరుకోగలుగుతుంది. రెండవది: తలసరి ఆహార ధాన్యాల వినియోగం నయా ఉదారవాద విధానాలకు పూర్వం ఉన్న స్థాయి కన్నా నయా ఉదారవాద కాలంలో తగ్గిపోయింది. పేదరికం నికరంగా పెరిగింది. 2017-18 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో కనీస పౌష్టికాహారం పొందలేకపోతున్నవారు 80 శాతానికి చేరుకున్నారు. మూడవది: ఆదాయాల్లో, సం పదల్లో అసమానతలు నయా ఉదారవాద కాలంలో మరింత ఎక్కువ అయ్యాయి. దేశంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం వ్యక్తుల వాటా దేశ సంపదలో 12 శాతంగా 1947 నాటికి ఉండేది. అది 1982 నాటికి 6 శాతానికి తగ్గింది. కాని ఇప్పుడ నయా ఉదారవాద విధానాల కారణంగా 23శాతానికి పెరిగింది. అంటే ఎంత తీవ్రస్థాయిలో అసమానతలు పెరిగాయో స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితుల్లో నయా ఉదారవాద చట్రం నుండి బద్దలుకొట్టుకుని బైటపడడం అనేది శ్రామిక ప్రజానీకానికి చాలా ముఖ్యం. అప్పుడే వారు తమ భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకోగలుగుతారు. ట్రంప్‌ ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు అందుకొక అవకాశాన్ని కల్పించింది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు