Saturday, May 10, 2025
Homeజాతీయంయువతకు ఉపాధి ఎలా?

యువతకు ఉపాధి ఎలా?

- Advertisement -

– ఈ అంశంపై 8వేలకు పైగా ప్రశ్నలు సంధించిన ఎంపీలు
– 17వ లోక్‌సభపై ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌’ విశ్లేషణ
– మోడీ పాలనలో పరిస్థితులపై ఆందోళన
దేశంలో యువతకు ఉపాధి తీవ్ర సమస్యగా మారింది. ప్రభుత్వానికి అది సవాలుగా మారింది. మన రాజకీయ నాయకత్వం సైతం యువత ఉపాధిని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ 17వ లోక్‌సభ (2019-2024)లో అడిగిన 60వేల కంటే ఎక్కువ పార్లమెంటరీ ప్రశ్నల పూర్తి పాఠాన్ని విశ్లేషించింది. ఉద్యోగ కల్పన, నియామకం, నైపుణ్యం, కృత్రిమ మేధస్సు (ఏఐ), గిగ్‌ వర్క్‌ ఎఫెక్ట్‌ వరకు యువత ఉపాధి సమస్యలతో నేరుగా ముడిపడి ఉన్న 8190 ప్రశ్నలను గుర్తించింది. అయితే, ఇది కూడా ఆశించినంత స్థాయిలో లేదని అర్థమవుతున్నది.
న్యూఢిల్లీ:
భారత యువత తీవ్ర అనిశ్చిత ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రతి నెలా దాదాపు పది లక్షల మంది యువత భారతీయులు ఉద్యోగ రంగంలోకి అడుగు పెడుతున్నారు. అయినప్పటికీ.. చాలా మంది తక్కువ జీతం, అనధికారిక, ప్రమాదకర ఉద్యోగాలలో ఉంటున్నారు. ఇది వారిని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇది ప్రజాస్వామ్య సమస్య కూడా. ఉపాధి అనేది ఒక వ్యక్తికి గౌరవాన్ని, స్థిరత్వాన్ని తీసుకొచ్చే ఒక ప్రాథమిక మార్గం. అయితే, ప్రజాస్వామ్య దేశంలో మాత్రం యువత ఇందుకు నోచుకోలేకపోతున్నది.
ఉపాధిపై 14 శాతం ప్రశ్నలు
యువత ఉపాధి విషయంలో మన దేశ పార్లమెంట్‌ సభ్యులు స్పందించిన విధానం వారి ప్రశ్నల రూపంలో వ్యక్తమైంది. 88 శాతం కంటే ఎక్కువ మంది ఎంపీలు, అంటే 481 మంది యువత ఉపాధిపై కనీసం ఒక ప్రశ్నను లేవనెత్తారు. కానీ ఈ 8190 ప్రశ్నలు ఐదేండ్ల కాలంలో అడిగిన అన్ని ప్రశ్నలలో 14 శాతం మాత్రమే కావటం గమనార్హం. యువత ఉపాధి సమస్యను సభ్యులు గుర్తించినా.. దానికి ప్రాధాన్యతనివ్వలేదని డేటా విశ్లేషణ తెలియజేస్తున్నది. ప్రశ్నల సంఖ్య, దాని లోతు.. ఈ రెండింటిలోనూ మహరాష్ట్ర ముందున్నది. యువత ఉపాధిపై అత్యధిక ప్రశ్నలు అడిగిన మొదటి ఐదుగురు ఎంపీలలో నలుగురు మహారాష్ట్రకు చెందినవారే కావటం గమనార్హం. ఇక యూపీ, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాల నుంచి మాత్రం ఎంపీలు ఆశించినంత స్థాయిలో ప్రశ్నలను సంధించలేదు.
పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న సమాచారాన్నే కోరిన వైనం
గిగ్‌ ఎకానమీ, ఏఐ, ప్లాట్‌ఫామ్‌ వర్క్‌ వంటి భవిష్యత్తును ఎదుర్కొనే సమస్యలపై ఎంపీలు తక్కువ శ్రద్ధ కనబర్చారు. కాంట్రాక్టు ఉద్యోగాల పెరుగుదల, ఉద్యోగ భద్రత లేకపోవటం, ఉపాధిలో లింగ, కుల అసమానతలు, ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలు, తగ్గిపోతున్న అధికారిక రంగ ఉద్యోగాలు, అనధికారిక, సామాజిక రక్షణ అంతరాలు, పని ప్రదేశాల భద్రతా సమస్యలు వంటి అంశాలనూ పార్లమెంటు సభ్యులు లేవనెత్తారు. ఇక ఎంపీలు అడిగిన చాలా ప్రశ్నలు బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను కోరుకోవటం గమనార్హం. సభ్యులు అడిగిన ప్రశ్నలలో నిర్మాణాత్మక సమస్యలు ప్రతిబింబించాయి.
కుల సంబంధిత ఉపాధిపై ఎస్టీ ఎంపీలు
షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ) నియోజకవర్గాల ఎంపీలు కుల సంబంధిత ఉపాధి ప్రశ్నలను గణనీయంగా ఎక్కువగా అడిగారు. మహిళా ఎంపీలు వారి మొత్తం ప్రశ్నలలో ఎక్కువ శాతం మహిళా సంబంధిత ప్రశ్నలను లేవనెత్తారు. ఇక యువత సమస్యలను 30-34 ఏండ్ల వయస్సు కలిగిన ఎంపీలు కాకుండా.. 40-44 ఏండ్ల వయస్సు కలిగిన ఎంపీలు ఎక్కువగా సభ దృష్టికి తీసుకొచ్చారు. యువ ఎంపీలు యువత ఉపాధికి సంబంధించి అత్యల్ప సగటు ప్రశ్నలను అడిగారు.
మోడీ సర్కారు విఫలం
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి దేశంలో ఉపాధికి సంబంధించి దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన గగనమైంది. దేశంలోని యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ.. ఆ వాగ్దానాన్ని గాలికొదిలేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 17వ లోక్‌సభ సమయంలో మోడీ సర్కారు ఉదాసీన వైఖరితో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు సైతం యువత ఉపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టాయని చెప్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఆశించినంత స్థాయిలో పని చేయలేదన్న విషయాన్ని మాత్రం వారు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -