నవతెలంగాణ-హైదరాబాద్: ఇటలీ రాజధాని రోమ్‌లో భారీ పేలుడు సంభవించింది. రోమ్‌లోని ప్రెనెస్టినో ప్రాంతంలో ఉన్న ఒక గ్యాస్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారులు తెలిపారు. ఒక ట్రక్కు గ్యాస్ పైప్‌లైన్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి, వెంట వెంటనే రెండు భారీ పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది.
కాగా రెండో పేలుడు ప్రభావం ఎక్కువగా ఉండి గ్యాస్ స్టేషన్ తోసహ సమీప భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 300 మీటర్ల దూరం వరకు శిథిలాలు ఎగిరి పడ్డట్టు స్థానిక మీడియా తెలిపింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, రోమ్ మేయర్ రాబర్టో గ్వాల్టియరీ, పోప్ లియో XIV ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి దగ్గరలోని మెట్రో స్టేషన్ మూసివేయగా, సమీప ప్రాంతాలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు.