నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ మాఢవీధులు భక్తుల గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోగా, శిలాతోరణం వరకు వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
జనవరి 16 వ తేదీన మొత్తం 78,733 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అదే రోజు 31,146 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా వచ్చిన కానుకలు రూ. 3.41 కోట్లకు చేరుకున్నట్లు అధికారుల సమాచారం. ప్రస్తుతం ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు సహనం పాటించి టీటీడీ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.



