నవతెలంగాణ-హైదరాబాద్: సెక్స్ కుంభకోణం కేసు నేపథ్యంలో సోదరుడు ఆండ్రూపై బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కఠిన చర్యలు తీసుకున్నారు. డ్యూక్ ఆఫ్ యార్క్ సహా అన్ని రాచరిక హక్కులను, గౌరవాలు, అధికారాలను వదులుకోవడంతో పాటు లండన్‌లోని విండ్సర్ ఎస్టేట్‌ను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రాజు ఆదేశాలతో ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్‌లోని సాండ్రిగ్‌హోమ్ ప్రైవేటు ఎస్టేట్‌లోకి మారతారని తెలిపింది. తనపై వచ్చిన ఆరోపణలను ఆండ్రూ తిరస్కరించినా.. ఈ చర్యలు నైతికంగా అవసరమైనవేనని రాజు భావిస్తున్నట్లు బకింగ్‌హమ్ ప్యాలెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో రాజు చార్లెస్, రాణి కెమిల్లా బాధితులవైపే ఉంటారని స్పష్టం చేసింది.
సెక్స్ కుంభకోణం కేసు అమెరికాను కుదిపేసిన విషయం తెలిసిందే. జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై అమెరికాలో చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు నమోదు అయ్యింది. సెక్స్ క్రైంలో దోషిగా తేలిన అతన్ని జైలులో వేశారు. అయితే మన్‌హట్టన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతను 2019లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎప్‌స్టీన్ కు సబంధించిన అన్ని అంశాలు బహిర్గతం చేయాలని ఇటీవల అమెరికా న్యాయ శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఇక ఈ కేసులో ఆండ్రూపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను అతను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నారు. అమెరికాకు చెందిన వర్జినియా గ్రిఫీ అనే బాధితురాలు ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసింది.
అయితే, ఇదంతా అభూతకల్పన అని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఎప్పుడూ కలువలేదని యువరాజు ఆండ్రూ తేల్చిచెప్పారు. ఆమె చేస్తున్న ఆరోపణలతో బ్రిటన్ రాజ కుటుంబం పరువుకు భంగం కలిగిందని ఆయన అన్నారు.

 
                                    