అసమానతల ‘మానవాభివృద్ధి’
ప్రపంచ మానవాభివృద్ధి ప్రగతి గడచిన మూడున్నర దశాబ్దాల్లో అత్యంత తక్కువ నమోదు కావడం పట్ల మొన్న ఐక్యరాజ్య సమితి చీఫ్ అంటానియో గుబెరస్ వ్యక్తపర్చిన ఆందోళన మానవాళికి హెచ్చరిక. కరోనా మహమ్మారితో పూర్తిగా రెండు సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ స్తంభించిన అనంతరం మానవాభివృద్ధిలో సుస్థిరత నెలకొని మరింత మెరుగుదల దిశగా పయనించాల్సింది పోయి అధమ స్థాయికి దిగజారడం ఆత్మవిమర్శనా పూర్వకంగా ఆలోచించాల్సిన విషయం. 2024 సంవత్సరానికి ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) ప్రపంచ మానవాభివృద్ధి నివేదికను మంగళవారం వెలువరించింది. కృత్రిమ మేధ యుగంలో ప్రజలు, అవకాశాలపై నివేదిక విశ్లేషిం చింది. మానవాభివృద్ధి ప్రగతి నిర్ణయించుకున్న లక్ష్యాలకనుగుణంగా లేదు. మానవాభివృద్ధి తక్కువ ఉన్న దేశాలు, ఎక్కువ ఉన్న దేశాల మధ్య అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని నివేదిక కుండబద్దలు కొట్టింది. ఈ అసమానతలు వరుసగా నాల్గవ తడవ కూడా మరింతగా విస్తరించడం ఆందోళన కలిగించే విషయం. ఆర్థిక, పర్యావరణ షాక్‌లు మానవాభివృద్ధికి తప్పవని, వాణిజ్య ఉగ్రవాదం పర్యవసానాలూ వెంటాడుతున్నాయని, రుణ సంక్షోభం, నిరుద్యోగిత పెరుగుతాయని క్లిష్టతర భవిష్యత్‌ను ఆవిష్కరించింది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎఐ)కు హ్యూమన్ ఫేస్ ఉండాలన్న హితబోధ జాగరూకతను సూచిస్తుంది. విద్యా,ఆరోగ్య రంగాలను ఆధునీకరించాలన్న సిఫారసు తక్షణం కార్యాచరణలో పెట్టాల్సి ఉంది.
మానవాభివృద్ధి సూచిలో భారతదేశం ర్యాంక్ గతం కంటే స్వల్పంగా మెరుగుపడినా..ఆర్థిక అసమానతలు, లింగ వివక్ష సవాళ్లను సృష్టిస్తూనే ఉన్నాయని యుఎన్‌డిపి నివేదికతో తెలుస్తుంది. 193 దేశాల్లో మన దేశం స్థానం 130. అదే 2022లో మన ర్యాంక్ 133. సుదీర్ఘ, ఆరోగ్యకర జీవితం, విజ్ఞానాన్ని సంపాదించడం, మంచి జీవన ప్రమాణం.. ఈ మూడు ప్రధాన అంశాల్లో మన దేశం బలంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఉపాధి హామీ, విద్యాహక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి కార్యక్రమాలు మానవాభివృద్ధి ప్రగతికి కొంత వరకు పని చేశాయని చెప్పవచ్చు. కాగా సమాజంలో ఆర్థిక అసమానతలు, లింగ వివక్ష ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో శత కోటీశ్వరుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఫోర్బ్స్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాయి. వాటికి అభిముఖంగా దిగజారుతున్న పేదరికం వృద్ధి, ప్రజల కొనుగోలు శక్తి తరుగుదల, పారిశ్రామిక మందగమనం, ఉపాధి అవకాశాల తగ్గుదల, పోషకాహార లోపం, పాఠశాలల్లో డ్రాపవుట్స్, బాలకార్మిక సమస్యలు పీడిస్తున్నాయి. ప్రపంచ ఆకలిసూచిలో ఇండియా స్థానం చిట్టచివరిలో ఊగిసలాట అసమానతల తీవ్రతకు ప్రతిరూపం.
2023-24లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 41.71 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో ఉటంకించబడింది. దీనికి కారణం గ్రామాల్లో మహిళల శ్రమ పెరిగిందని అర్థం. మహిళాశక్తి సద్వినియోగం కావాలంటే మహిళలు ఉద్యోగాల్లో చేరే వాతావరణం నెలకొల్పబడాలి. వారు తమ ఉద్యోగాలను నిలుపుకునే అవకాశాలు సృష్టించబడాలి. ప్రస్తుతం ఆ పరిస్థితులు తక్కువేనన్నది నిపుణుల మాట. రాజకీయ భాగస్వామ్యంలో మహిళల వెనుకబాటు కొనసాగుతోంది. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎప్పటికి సాకారమవుతాయో తెలియకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పు రాకుండా మానవాభివృద్ధి పెరగదన్నది కఠోర నిజం. ఆదాయ, లింగ అసమానతలు భారతదేశ మానవాభివృద్ధి ప్రగతిని 30.7 శాతం తగ్గించాయి. ఎ.ఐ., అభివృద్ధి పరిమితులపై మానవాభివృద్ధి ఆధారపడి ఉంది. ఎ.ఐ. విషయంలో 2019లో సున్నా స్థానంలో ఉన్న ఇండియా పరిశోధకులను నిలుపుకుంది. అభివృద్ధి వైపు అడుగులేస్తోంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ప్రజా సేవల డెలివరీలో ఎ.ఐ.ని ఉపయోగించాలి. కానీ ఎ.ఐ. ఇప్పటికే నెలకొని ఉన్న అసమానతలను తీవ్రతరం చేసే ప్రమాదాన్ని నివారించే సరైన విధానం, రక్షణ చర్యలు అత్యవసరం. యుఎన్‌డిపి నివేదిక సారాంశం ఇదే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES