Saturday, October 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్వందల ఫోన్లు..ప్రమాద తీవ్రతకు ఇదే ప్రధాన కారణం

వందల ఫోన్లు..ప్రమాద తీవ్రతకు ఇదే ప్రధాన కారణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్‌ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్‌ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ‘తొలుత బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగానే దాని ఆయిల్‌ ట్యాంక్‌ మూత ఊడిపడి అందులోని పెట్రోల్‌ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో ద్విచక్రవాహనం ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్‌ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్‌ ఫోన్లతో కూడిన పార్సిల్‌ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్‌ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు’ అని ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్‌ బృందాలు గుర్తించాయి.

లగేజీ క్యాబిన్‌లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. దీంతో డ్రైవర్‌ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా.. కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -