Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో హైదరాబాద్ విద్యార్థికి తీవ్ర గాయాలు

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థికి తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఫ్లోరిడాలో నివసిస్తున్న మహమ్మద్ ఆమిర్ హుస్సేన్ (23) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి వద్దకు వెళ్లేందుకు వీలుగా ఎమర్జెన్సీ వీసా జారీ చేయాలని అమెరికా కాన్సులేట్‌ను వేడుకుంటున్నారు. నగరంలోని అంబర్‌పేట, తూరబ్‌నగర్‌కు చెందిన ఆమిర్ 2023లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. గురువారం అతను కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతుండగా, తాను నివసిస్తున్న ‘సోషల్ సెమినోల్ ఎఫ్’ భవనంలో మంటలు చెలరేగాయని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఆ వెంటనే అతడి ఫోన్ కాల్ కట్ అయింది.

కొంతసేపటి తర్వాత ఆమిర్ స్నేహితుడు కల్యాణ్ ఫోన్ చేసి ఆమిర్‌ను తొలుత టలహాసీ మెమోరియల్ హెల్త్‌కేర్‌కు, అనంతరం గెయిన్స్‌విల్లేలోని యూఎఫ్ హెల్త్ షాండ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాడు. అప్పటి నుంచి ఆమిర్ ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం అందకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై వారు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్‌ను ఆశ్రయించగా ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబానికి తెలియజేయాలని కోరారు. కాలిన గాయాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, ఈ క్లిష్ట సమయంలో కుమారుడికి తోడుగా ఉండేందుకు వీసా మంజూరు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -