– టై, బెల్టులు, షూస్ కూడా తీసుకోవాలని ఒత్తిడి
– స్కూల్స్ ప్రారంభానికి ముందే దందా
– ‘ప్రయివేటు’ యాజమాన్యాల ఇష్టారాజ్యం
– పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రతి ఏడాది లాగే ఈసారీ పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల దందా సాగుతోంది. పాఠశాలల ప్రారంభానికి ముందు నుంచే సంబంధిత మెటీరియల్స్ కొనుగోలు చేయాలని యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక కొందరు కొనుగోలు చేస్తుంటే.. మరికొందరు వాయిదా వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
2025-26 నూతన విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనికి ఇంకా 15 రోజుల సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే బుక్స్, యూనిఫామ్స్, టై, బెల్ట్, షూస్ లాంటి మెటీరియల్స్ కొనుగోలు చేయాలని ఆయా ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. ఈ 15 రోజులు పిల్లలు సమయం వృథా చేయకుండా.. కొత్త పుస్తకాలు చదువుకుని ముందే అవగాహన పెంచుకుంటే సులువుగా అధిక మార్కులు సాధించొచ్చంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాయి. దీంతో యాజమాన్యాల ఒత్తిడి భరించలేక నిరుపేద తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ బుక్స్‌తోపాటు ఇతర మెటీరియల్స్ కొనుగోలు చేస్తూ.. ఇబ్బందులకు గురవుతున్నారు.
నిషేధం ఉన్నా.. యథేచ్ఛగా అమ్మకాలు
ఏడాది కాలంగా పాఠశాలల్లో టై, బెల్టులు, యూనిఫాంల అమ్మకాలపై విద్యాశాఖ అధికారులు నిషేధం విధించారు. అయినా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని యాజమాన్యాలు యథేచ్ఛగా అమ్మకాలు చేపడుతున్నాయి. పుస్తకాల వరకు స్కూల్స్‌లో తీసుకుని మిగతా మెటీరియల్ బయట కొనుగోలు చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నా.. వారు వినడం లేదు. మొత్తం తమ వద్దే కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో కొందరు తల్లిదండ్రులు బుక్స్, యూనిఫామ్ కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ఇంకా సమయం ఉంది కదా అని వాయిదా వేసుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఎందుకు కొనుగోలు చేయాలని మరికొందరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే.. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఎలాగైనా తమ వద్దే కొనుగోలు చేసేలా ఒప్పిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
20 శాతం రేట్లు పెంపు..!
దాదాపు నెల రోజులుగా పలు పేరొందిన పాఠశాలలు మొదలు ద్వితీయశ్రేణి స్కూళ్ల వరకు అడ్వాన్స్ అమ్మకాలకు తెర తీశాయి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ను మూడు, నాలుగు నెలల కిందటే ప్రింటింగ్ చేయించి గోదాముల్లో భద్రపరిచారు. తరగతుల వారీగా పిల్లల ఎత్తు, వయస్సును బట్టి యూనిఫాం, షూస్, టై, బెల్టులు తయారు చేయించారు. గతేడాది కంటే 20 శాతం రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఈసీఐఎల్‌లోని ఓ పేరొందిన ప్రయివేటు స్కూల్‌లో ఒకటో తరగతికి 2024లో బుక్స్, నోట్‌బుక్స్‌కు రూ.4 వేలు తీసుకోగా.. ప్రస్తుతం రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. యూనిఫాంకు గతేడాది రూ.1,000 తీసుకోగా.. ఇప్పుడు రూ.1,200 అడుగుతున్నట్టు పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 నుంచి 10వ తరగతి విద్యా ర్థుల బుక్స్, నోట్‌బుక్స్‌కు దాదాపు రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారని మరికొందరు వాపోతున్నారు.
ఇతర స్కూళ్లకు వెళ్లకుండా..!
2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన విద్యనందించాలనే ఉద్దేశంతో ఇతర స్కూళ్లలో జాయిన్ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం టీసీ, బోనఫైడ్ సర్టిపికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను వదులుకోవద్దనే భావనతో పిల్లలు, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడుతున్నాయి. వచ్చే ఏడాది ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి మార్కులు వచ్చేలా కృషి చేస్తామని నమ్మబలుకుతున్నాయి. దీంతో కొందరు పాఠశాల మారే నిర్ణయాన్ని మార్చుకుంటుండగా.. మరికొందరు స్కూల్ మారేందుకే ఆసక్తి చూపుతున్నారు.
చర్యలు తీసుకోవాలి
జిల్లా విద్యాశాఖాధికారి తక్షణమే స్పందించి అధిక రేట్లకు బుక్స్, యూనిఫాం విక్రయిస్తున్న పాఠశాలల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లోనే కిరాణా షాపుల్లో సరుకులు అమ్మినట్టుగా బుక్స్, యూనిఫామ్, టై, బెల్టులు, పెన్నులు, పెన్సిల్స్ అమ్మడం సిగ్గుచేటు. తమ వద్దే మెటీరియల్స్ మొత్తం కొనాలని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులను భయపెట్టడం సరికాదు. విద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది. నిలువు దోపిడీ చేస్తున్న ఆయా పాఠశాలలపై క్రిమినల్ కేసులు పెట్టాలి. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులను కొంత వరకైనా కట్టడి చేయొచ్చు.
– కార్తీక్, ఎస్‌ఎఫ్‌ఐ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి