నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్సీబీ చేతిలో 43 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సీఎస్కే ఐపీఎల్-2026 సీజన్‌లో వరుసగా మూడవ ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో సీఎస్కే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. -2.517 నెట్ రన్ రేట్‌తో పట్టికలో అట్టడుగున ఉంది. ఒక ఐపీఎల్ సీజన్ ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది రెండవ అతి పెద్ద ఓటమి. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓటమికి పూర్తి బాధ్యత వహించాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా తాను రాణించి ఉంటే బాగుండేదని, అప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమోనని రుతురాజ్ అభిప్రాయపడ్డాడు. అందుకే ఈ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నానని తెలిపాడు. బౌలింగ్ చేసే సమయంలో 14వ ఓవర్ వరకూ మ్యాచ్ చెన్నై చేతుల్లోనే ఉందని, ఆ తర్వాతే పరిస్థితి మారిపోయిందని అన్నాడు. టిమ్ డేవిడ్‌ను అన్షుల్ కాంబోజ్ క్లీన్ బౌల్డ్ చేశాడని, కానీ అది నో బాల్ అయిందని గుర్తు చేశాడు. ఆ తర్వాత డేవిడ్ మరింత దూకుడుగా ఆడాడని చెప్పాడు. డేవిడ్ అప్పటికే ఔటై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ అంత స్కోర్ చేసి ఉండేది కాదని పేర్కొన్నాడు.



