నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారీ షాకిచ్చింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ స్థానంలో స్కాట్లాండ్ టీంను భర్తీ చేసింది. ఈమేరకు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నికి భారత్-శ్రీలంక దేశాలు సంయుక్తం ఆతిథ్యం ఇస్తున్నాయి.
అయితే ఇటీవల బంగ్లాదేశ్‌లో చెలరేగిన రాజకీయ సంక్షోభంతో ఆ దేశంలోని మైనార్టీలైన హిందువులపై అల్లరిమూకలు విచక్షణ రహితంగా దాడులు చేసి చంపేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడులను భారత్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అదే విధంగా యూనిస్ ఖాన్ సర్కార్ తీరును ఖండిస్తూ ఇండియాలో భారీ ఆందోళనలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే ఆందోళనల సెగ ఐపీఎల్ వేలంకు తాకింది. బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజర్ రెహ్మన్‌ను తొలగించాలని భారత్‌లో డిమాండ్లు వెలువెత్తాయి. దీంతో కేకేఆర్ జట్టు యాజమాన్యం.. బీసీసీఐ సూచనతో సదురు క్రికెటర్‌ను తొలగించింది.
భారత్ చర్యకు ప్రతీకారంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తూ యూనిస్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇండియాలో బంగ్లా ఆటగాళ్లకు భద్రతా లేదని, భారత్ వేదికగా(ముంబాయి, కలకత్తా) జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోమని, తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా జరిపించాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే బంగ్లా విన్నపాన్ని స్వీకరించిన ఐసీసీ..బంగ్లా ఆటగాళ్లకు ఇండియాలో అతి ప్రమాదం లేదని, వారి జట్టుకు పూర్తి భద్రతా కల్పించ బాధ్యత తమదని భరోసా ఇచ్చినా..బీసీబీ ఇండియాలో ఆడబోమని మొండికేసి కూర్చుంది. దీంతో పలుమార్లు బీసీబీ, ఐసీసీల మధ్య చర్చలు సాగిన సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో తాజాగా బంగ్లాదేశ్ టీం స్థానంలో స్కాట్లాండ్ జట్టును తీసుకున్నట్లు ప్రకటించింది.



