– ఆపరేషన్ సిందూర్ ముగియలేదు
– త్రివిధ దళాలకు ప్రధాని స్పష్టీకరణ
– తాజా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష
– సైనిక కమాండర్లకు పూర్తి అధికారాలు
– పీవోకేను అప్పగించాలి : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ
– సమస్య పరిష్కారానికి ఇరు దేశాలతో చర్చిస్తా : డోనాల్డ్ ట్రంప్
– పార్లమెంటును సమావేశపరచండి : ప్రధానికి రాహుల్ లేఖ
– నేడు హాట్‌లైన్‌లో భారత్ పాక్ చర్చలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఒక్క తూటా పేల్చినా.. మీరు క్షిపణితో సమాధానమివ్వండని భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదనీ, పాక్ కాల్పులు జరిపితే.. భారత్ కూడా కాల్పులు జరుపుతుందని అన్నారు. కాల్పుల విరమణపై పాక్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తాజా పరిస్థితిని సమీక్షించారు. న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్‌చౌహాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ.. ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్ చేయడంపైనే పాకిస్తాన్‌తో తమ చర్చలు ఉంటాయని చెప్పినట్టు తెలుస్తోంది. పీవోకేను భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు మరో గత్యంతరం లేదని, ఉగ్రవాదులను అప్పగిస్తేనే తాము వాళ్లతో మాట్లాడుతామని తేల్చి చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని మోడీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సోమవారం రెండు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. ఉద్రిక్తతల నివారణలో ఈ చర్చలు కీలకం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలావుండగా భారత వైమానిక దళం ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఆపరేషన్ సిందూర్‌లో తనకు అప్పగించిన పనిని భారత వైమానిక దళం కచ్చితత్వంతో, నైపుణ్యంతో విజయవంతంగా నెరవేర్చింది. జాతి లక్ష్యాలకు అనుగుణంగా ఆపరేషన్‌ను ఉద్దేశ పూర్వకంగా, వివేకవంతంగా నిర్వహించింది’ అని తెలిపింది. ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతున్నందున తగిన సమయంలో పూర్తి వివరాలు అందజేస్తామని చెప్పింది. ఊహాగానాలకు ఆస్కారం ఇవ్వొద్దని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని కోరింది.
సైనిక కమాండర్లకు పూర్తి అధికారాలు
పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడిన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు సైనిక కమాండర్లకు పూర్తి అధికారాలు అప్పగించారు. పశ్చిమ సరిహద్దులలో నెలకొన్న భద్రతా పరిస్థితిని సైనిక దళాల ప్రధానాధికారి (సీఓఎఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం సమీక్షించారు. ‘ఈ నెల 10వ తేదీన డీజీఎం లు ఒక అవగాహనకు వచ్చారు. దీనిని ఉల్లంఘించేలా పాకిస్తాన్ చర్యలకు పాల్పడితే వాటిని ఎదుర్కొనేందుకు సైనిక కమాండర్లకు సీఓఎఎస్ పూర్తి అధికారాలు కల్పించారు’ అని సైనిక దళాలకు చెందిన ప్రజా సంబంధాల డైరెక్టర్ జనరల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాశ్మీర్ సమస్యపై చర్చిస్తా : ట్రంప్
కాశ్మీర్ సమస్యకు వేయి సంవత్సరాల తర్వాతైనా పరిష్కారం దొరుకుతుందా అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై రెండు దేశాలతో చర్చిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కాల్పుల విరమణ ప్రకటించిన రెండు దేశాల నాయకత్వాలను ట్రంప్ అభినందించారు. భారత్, పాకిస్తాన్‌తో వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నట్టు ప్రకటిం చారు. దీనిపై ఇంకా చర్చలు జరగలేదని చెప్పారు.
ఇక యుద్ధం వద్దు : పోప్
కాల్పుల విరమణను పోప్ లియో 14 స్వాగతించారు. పోప్‌గా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారిగా ఆదివారం నాడు సందేశాన్ని అందిస్తూ ఇక యుద్ధం వద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచానికి శాంతిని ప్రసాదించాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని, గాజాలో కాల్పుల విరమణ జరగాలని, హమాస్ వద్ద ఉన్న ఇజ్రాయిల్ బందీలు తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు.
భయాందోళనను వీడని సరిహద్దు ప్రాంతాల ప్రజలు
ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగినప్పటికీ సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో భయాందోళనలు వీడలేదు. కొన్ని రోజుల తరబడి కొనసాగిన కాల్పులు, డ్రోన్ దాడులు వారిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. కాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలలో…బారాముల్లాలోని యురి నుంచి బందిపొరాలోని గురెజ్ వరకూ…పరిస్థితులు క్రమేపీ కుదుటపడుతున్నాయి. శనివారం రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని కుప్వారాకు చెందిన స్థానికుడొకరు తెలిపారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే స్వస్థలాలకు చేరుకుంటున్నారు. శతఘ్నుల పేలుళ్లు, డ్రోన్ల దాడులతో అట్టుడికిపోయిన పంజాబ్, రాజస్థాన్ గ్రామాలు కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. శనివారం నుంచి జమ్మూలోని ఉధంపూర్‌లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని అధికారులు తెలిపారు.
నేడు హాట్‌లైన్‌లో భారత్-పాక్ చర్చలు
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద క్రమంలో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ అధికారులు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్తాన్ డీజీఎంవో హాట్‌లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. కాగా తదనంతర పరిస్థితులపై నేటి సమావేశంలో కీలకం కానుంది.
బుల్లెట్లు వస్తే..మిస్సైల్స్‌తో సమాధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES