నవతెలంగాణ-హైదరాబాద్: హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను హెచ్ఎంఎస్, సింగరేణి జాగృతి నాయకులు ఘనంగా సత్కారించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.సింగరేణిలో అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. అవినీతిని కట్టడి చేయకుంటే సింగరేణి భవన్ ను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. ప్రతి కాంట్రాక్ట్ లో 25 శాతం అవినీతి జరుగుతోందని, 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సింగరేణిలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని, అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, సీఎంలను ఆమె డిమాండ్ చేశారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురబోతోందన ఆశాభావం వ్యక్తం చేశారు.

త్వరలోనే జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికుల విశ్వాసం పొంది హెచ్ఎంఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ లో గౌరవాధ్యక్షురాలిగా తనను ఎన్నుకున్నారని, మీరిచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మికుల బాగు కోసం పనిచేస్తానని కవిత హామీ ఇచ్చారు.గుర్తింపు సంఘం అనుకుంటున్న వాళ్లు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. నిజానికి సింగరేణి ఎన్నికల్లో వాళ్లకు గెలిచే అంతా సీన్ లేదు ఎద్దేవా చేశారు. అప్పుడు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కారణంగా ఆ పరిస్థితి వచ్చిందని, సింగరేణిలో ఇప్పుడున్న ఎర్రజెండా కాకుండా మరొక జెండా ముందుకు రాబోతోందని జోస్యం చెప్పారు.
హెచ్ఎంఎస్, జాగృతి సంస్థలు మొత్తం 40 వేల మంది సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తాయని,కార్మిక చట్టాలన్నీ అమలయ్యేలా తామంత పోరాటం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి తీరుకు వ్యతిరేకంగా కొట్లాడుదాం
సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కొత్త కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు.పదో తరగతి పాస్ కాలేదంటూ 470 అప్లికేషన్స్ ఆపేశారని, .. చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలను నియమించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉన్న మైన్స్, మినరల్స్ ను వినియోగించుకొని ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించాలని సూచించారు.
సింగరేణి ప్రాంత ప్రజలకు దక్కాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారని, లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 వేల కోట్ల బకాయిలు పెట్టి నష్టాల్లోకి నెట్టేస్తోందని, ఇలా చేస్తే సంస్థ భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు.గతంలో సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచుకోలేకపోయాం.. దానికి పరిష్కారంతో పాటు మెడికల్ బోర్డు తెచ్చుకునేందుకు పోరాటం చేద్దామని యూనియన్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
