మనిషి జీవితంలో నమ్మకం ఒక శక్తివంతమైన సాధనం. అది ఆశను ఇస్తుంది, గమ్యం చూపిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అయితే ఆ నమ్మకం సత్యంపై, శాస్త్రీయతపై, ఆత్మవిశ్వాసంపై ఆధారపడితేనే అది పురోగతికి తోడ్పడుతుంది. లేదంటే అదే నమ్మకం మూఢనమ్మకంగా మారి వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుంది.
భారతదేశం ప్రపంచానికి విజ్ఞాన కేంద్రంగా వెలుగొందుతున్న దేశం. స్పేస్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, డిజిటల్ విప్లవంలో అభివద్ధి సాధిస్తున్న దేశం. కానీ అదే దేశంలో, అదే సమాజంలో… అసంఖ్యాకమైన ప్రజలు ఇప్పటికీ జాతకాలు, మంత్రాలు, వాస్తు, పంచాంగాలు, దయ్యాలు, పూజలు, బాణామతి పేర్లతో మూఢనమ్మకాల అంధకారంలో బతికేస్తున్నారు. ఇటీవల నరబలులు, బాణామతి పేరుతో చంపడాలు, హింసించటాలు వంటివి పెరగడం మనుషులను అంధకారంలోకి నెడుతున్నాయి. ఇవి ప్రతి మతంలోనూ ప్రజలను పట్టి పీడిస్తున్న రుగ్మతలుగా ఉంటున్నాయి.
ప్రతి ఒక్కరూ వారి నమ్మకాలను, సాంప్రదాయాలను ఆచరించడం ఇతర మతాల వారి ఆచార సంప్రదాయాలను గౌరవించడం చాలా ముఖ్యం. కానీ ఈ ఆచార సంప్రదాయాలు వారి అభివద్ధిని పెంపొందించే విధంగా వుండాలే కానీ అజ్ఞానాన్ని విస్తరించేవిగా కాదు.
నమ్మకం, మూఢనమ్మకం వ్యత్యాసం :
నమ్మకం అనేది తెలియని విషయాన్ని తెలుసుకునే వరకు కలిగే ఆశ. కానీ తెలిసిన తర్వాత కూడా అదే తప్పుడు భావనను కొనసాగించడమే మూఢనమ్మకం. ఉదాహరణకు… సూర్యుణ్ని దేవుడిగా కొలచిన కాలం సరైనదే. కానీ శాస్త్ర విజ్ఞానం సూర్యుడు నక్షత్రమని నిరూపించిన తర్వాత కూడా భయంతో, సంప్రదాయమనే ముసుగులో అతనిని దేవుడిగా భావించడం మూఢనమ్మకం కాక మరేమిటి?
మూఢనమ్మకాలకు మూలాలు:
– అజ్ఞానం, చదువు లేకపోవడం, తార్కికతకు కొరత
– చదువు లేకపోవడం, శాస్త్రీయ దక్పథం లేమి మూఢ నమ్మకాలకు గడ్డం అవుతుంది.
– భయం.. సమస్యలపై అవగాహన లేకపోవడం
అసలు సమస్యల్ని అర్థం చేసుకోకపోవడం, భయంతో చర్యలు తీసుకోవడం మూఢనమ్మకాలకు దారి తీస్తుంది.
సంప్రదాయాల పేరుతో మూఢత్వానికి ఊతం:
‘పెద్దలు చెప్పినదే నిజం’, ‘ఇలా చేస్తే మంచే జరుగుతుంది’ అనే మాటలు మూఢత్వానికి ఆధారస్తంభాలు.
అమాయకత్వం – తర్కం లేని విశ్వాసం:
ఏ విషయంలోనూ శాస్త్రీయంగా విశ్లేషించక, మాంత్రికులు, పూజారుల మాటలతో జీవితం నడిపించడం చాలా మంది అమాయక ప్రజల పరిపాటిగా మారింది.
మూఢనమ్మకాలు – ఎవరి జీవితాన్నీ వదలవు!
వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీయడం:
వివాహాలు, పిల్లల జాతకాలు, సమస్యలపై తంత్రాలు, మంత్రాలు, నరబలులు… ఇవన్నీ కుటుంబాలను నాశనం చేస్తున్నాయి.
ఆర్థికంగా దివాళా:
పూజలు, హోమాలు, తాయత్తులు పేరిట లక్షల రూపాయల ఖర్చు. అసలైన పరిష్కారం లేకుండా మోసపోతున్న ప్రజలు!
సామాజిక అన్యాయం:
బాలింతలపై మూఢనమ్మకాల పేరు మీద పీడనలు, బాలికలపై ఆచారాల పేరుతో అణచివేత, లింగ వివక్ష… ఇవన్నీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్న తుపానులే!
వ్యవసాయానికి భూతబాధ:
జీవ రసాయనాల కన్నా బాణామతికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి వ్యవసాయ భూములను హానిచేసే పద్ధతులు రైతుల భవిష్యత్తును మింగేస్తున్నాయి.
ఇప్పటికీ చీకట్లో చదువుకున్నవారూ!
అవును! చదువుకున్నవారిలో కూడా బలమైన తార్కిక దక్పథం లేకపోతే, వారు కూడా బాణామతుల చీకటి మాయలో పడిపోతారు. ఐ ఏ స్, ఐ పి స్ లు, డాక్టర్లు, సైంటిస్టులంతా కూడా కొన్ని మూఢనమ్మకాల్లో నమ్మకాన్ని పెట్టడం మనం చూశాం. ఇది జ్ఞాన సమాజానికి పెనుముప్పు.
బలైపోతున్నవారు మూఢనమ్మకాల మాయలో :
– క్షుద్ర పూజల పేరుతో చిన్నారులపై అత్యాచారాలు, నరబలులు
– బాణామతి నెపంతో మహిళలపై చిత్రహింసలు
– సంప్రదాయాల పేరుతో జంతు బలులు
– భయాలు పెంచి దోపిడీకి పాల్పడే మాంత్రికులు, పూజారులు
ఇవన్నీ మన దేశ అభివద్ధికి అడ్డుగోడలే!
నిర్మూలనకు మార్గాలు
విద్యతో మార్పు:
పిల్లలకు చిన్నతనం నుంచే తర్కబద్ధమైన ఆలోచనలు నేర్పాలి. పాఠశాల స్థాయిలో శాస్త్రీయ దష్టి పాఠ్యాంశంగా ఉండాలి.
మీడియా చైతన్యం:
సినిమాలు, టీవీ షోలు, యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల ద్వారా శాస్త్రీయతపై చైతన్యం తీసుకురావాలి. ప్రముఖులు గళం వినిపించాలి.
చట్టాలు, అంధశ్రద్ధ నిర్మూలన చట్టం:
మహారాష్ట్రలో అమలైనట్లు అంధవిశ్వాసాలపై నిషేధ చట్టాలు దేశవ్యాప్తంగా అవసరం. మాంత్రికులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మేధావుల బాధ్యత:
బుద్ధిజీవులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు శాస్త్రీయ దక్పథాన్ని ప్రచారం చేయాలి. ప్రజల్లో భయం కాకుండా విజ్ఞానం నింపాలి.
నమ్మకం బతికిస్తే మూఢనమ్మకం బలిచేస్తుంది!
కళ్ళు మూసుకుని నమ్మకాన్ని కొనసాగించడం కాదు… కళ్ళు తెరిచి, విచారించి, తెలుసుకుని నడిచే సమాజం కావాలి.
నేత్రసాక్షిగా గగనాన్ని చేరే విజ్ఞానయానం జరగాలంటే… భూతాల నమ్మకాలను విడిచిపెట్టాలి!
మనుషుల బలహీనతలను, భయాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వారి వ్యాపార స్వార్ధలకు ఈ మూడ నమ్మకాలను వ్యాప్తి చేసి పబ్బం గడుపుకుంటున్నారు, అలాంటిని వారిని అడ్డుకోవడం అందరి బాధ్యత
గ్రహబలాలపై కాదు, కష్టపడి కలలు నెరవేర్చే నీ బలంపై నమ్మకం పెట్టు అనుకున్నది సాధిస్తావు.
ఆత్మవిశ్వాసం ముద్దు అంధ విశ్వాసం వద్దు.
జి. అజయ్ కుమార్
సామాజిక విశ్లేషకులు
నమ్మకం బతికిస్తే మూఢనమ్మకం బలిచేస్తుంది
- Advertisement -
- Advertisement -