వాషింగ్టన్ : ఈ ఏడాది నవంబరులో న్యూయార్క్ మేయర్ పదవికి జరిగే ఎన్నికలలో డెమొక్రటిక్-సోషలిస్ట్ అభ్యర్ధి జోహ్రాన్ మాందానీ విజయం సాధిస్తే ఆ నగర పాలనను ఫెడరల్ ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాటకీయ హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ సిటీలో, వాషింగ్టన్ డీసీలో స్థానిక నాయకత్వాలు తన ప్రభుత్వ అజెండాకు కట్టుబడి ఉండని పక్షంలో వాటిని ఫెడరల్ ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు నగరాలూ డెమొక్రాట్ల అధీనంలో ఉన్నాయి. శ్వేతసౌధంలో జరిగిన క్యాబినె ట్ సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తూ న్యూయార్క్ మేయర్‌గా మాందానీ గెలిస్తే ఆ నగరాన్ని అధ్యక్ష భవనం తన నియంత్రణలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అక్కడ నేరాలు పెరిగిపోయాయని, అక్రమాలు చోటుచేసుకుంటున్నా యని ఆరోపించారు. ‘న్యూయార్క్ నగరాన్ని పాలించేందుకు ఓ కమ్యూనిస్టు ఎన్నికైతే అది ఎన్నటికీ ఒకేలా ఉండబోదు’ అని మాందానీని ఉద్దేశిస్తూ ట్రంప్ చెప్పారు. అవసరమైనప్పుడు ఆయా ప్రదేశాలను పరిపాలించడానికి శ్వేతసౌధంలో తమకు కావాల్సినంత బలముందని వ్యాఖ్యానించారు. ‘న్యూయార్క్ కోసం మేము ఏదైనా చేస్తాం. ఇంతకంటే ఏమీ చెప్పలేను. కానీ న్యూయార్క్‌ను మరోసారి గొప్ప నగరంగా మారుస్తాం. అలాగే దేశాన్ని కూడా’ అని చెప్పుకొచ్చారు. న్యూయార్క్ నగరం సక్రమంగా నడుస్తుందని, దానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని అంటూ తాను న్యూయార్క్‌ను ప్రేమిస్తున్నానని తెలిపారు. ‘మేము న్యూయార్క్‌ను సరిదిద్దబోతున్నాం. జరగబోయేది అదే. బహుశా మనం వాషింగ్టన్ నుంచే ఆ పని మొదలు పెట్టాలి’ అని అన్నారు. న్యూయార్క్ మేయర్ పదవికి జరగబోతున్న ఎన్నికలలో ప్రత్యర్థులైన ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో కంటే మాందానీ ముందంజలో ఉన్నారు. దీంతో మాందానీపై ట్రంప్ పదే పదే దాడి చేస్తున్నారు. ఆయన ‘ఒక విపత్తు’ అంటూ ఆరోపించారు. ఆయన డెమొక్రాట్ల నామినేషన్ పొందారని, వారు ఏ వైపు వెళుతున్నారో ఇది సూచిస్తోందని విమర్శించారు.
మాందానీ గెలిస్తే న్యూయార్క్‌ను మేమే పాలిస్తాం : ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES