- కొత్తపల్లి శివకుమార్, సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్: ప్రశ్నించే గొంతులను అంతం చేయాలనే కుట్రబుద్ధితో కేంద్ర ప్రభుత్వం సీపీఐ(ఎం-ఎల్ )మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు గారిపై ఉపా, దేశద్రోహ కేసులను నమోదు చేసిందని, వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సి.పి.ఐ(ఎం-ఎల్ )మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్, సామజిక అధ్యయన వేదిక కన్వీనర్ లింగంపల్లి భద్రయ్య, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.లింగయ్యలు పాల్గొని మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని, అంబానీ ఆదానీ ఆస్తులను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, సహజ వనరులు,సంపదలు మొత్తం వారికే దోచిపెడుతుందని, ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా ముద్రలు వేస్తుందని అన్నారు.
సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు గారిపై దేశద్రోహ, ఉపా కేసులు పెట్టిందని వారు ఆరోపించారు. వాస్తవానికి 1967 ఉపా చట్టం చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించే టెర్రరిస్టు సంస్థలకు, అక్రమ ఆయుధ వ్యాపారస్తులకు వర్తిస్తుందని, కానీ బిజెపి ప్రభుత్వం 2019లో సవరణ చేసి ఆ చట్టాన్ని వ్యక్తులకు ఆపాదించడంలో నిమగ్నమై పోయిందని వారు అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్,సాయిబాబా లాంటి వారిపై కూడా ఇదే విధంగా కేసులు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. గత 50 సంవత్సరాలుగా విద్యార్థి సంఘంలో,యువజన సంఘం లో,పార్టీగా పీడిత ప్రజాపక్షాన అనేక పోరాటాలు చేసిన కామ్రేడ్ రంగారావు గారిపై ఉన్న అన్ని రకాల కేసులు కొట్టివేయబడినయని, ఆయన నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం కృషి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై ఆయుధాల చట్టం నమోదు చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రజల నుండి వ్యతిరేకత తీవ్రమవుతున్న తరుణంలో, సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం, ఆ వ్యతిరేకతను తట్టుకోలేని తట్టుకోలేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. కమ్యూనిస్టు విప్లవకారులు ఎప్పుడూ కూడా కుట్ర దారులు కాదని, ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చని పాలకులే అసలు కుట్ర దారులని ఆయన ఆరోపించారు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో ప్రశ్నించే గొంతులను ఆపలేరని, పాలకులు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరినారు. కామ్రేడ్ రంగారావు గారి పై పెట్టిన దేశద్రోహ ఉపా, కేసులను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాబోయే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిడిఎస్యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రకళ, కొత్తపల్లి రేణుక, పిఓడబ్ల్యు జిల్లా సహాయ కార్యదర్శి సంతోషిమాత జిల్లా నాయకులు కల్పన,పద్మ, అనసూయ, రేణుక, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు భీమనపల్లి ప్రకాష్, నితిన,రాజు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.



