– మరో 60లక్షల హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు : ఐరాస
జెనీవా: హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాలకు నిధులు ఇవ్వొద్దనే నిర్ణయాన్ని అమెరికా మార్చుకోకుంటే, 2029 నాటికి 40 లక్షలకుపైగా ఎయిడ్స్ మరణాలు సంభవించొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే నాలుగేండ్లలో మరో 60 లక్షల మందికిపైగా హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ల బారినపడొచ్చని అంచనా వేసింది. ఆరు నెలల క్రితం డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే ఐక్యరాజ్యసమితికి చెందిన హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమానికి (యూఎన్ ఎయిడ్స్ ) నిధుల మంజూరును ఆపేశారు. తాము ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాలకు ట్రంప్ నిర్ణయంతో పెను విఘాతం కలిగిందని యూఎన్ ఎయిడ్స్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే అమెరికా నిధుల లోటు వల్ల ఎన్నో దేశాల్లో ఎయిడ్స్ రోగులకు చికిత్సలు అందించే ఆస్పత్రుల్లో సిబ్బంది, ఔషధాలు, వైద్య సదుపాయాల కొరత ఏర్పడిందని పేర్కొంది. హెచ్‌ఐవీ టెస్టుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయిందని చెప్పింది. చాలా దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు ఎయిడ్స్ రోగులకు అందించే సేవలు మందగించాయని తెలిపింది.
ట్రంప్ ఎంట్రీతో అటకెక్కిన రూ.34వేల కోట్ల సాయం
2025 సంవత్సరంలో యూఎన్ ఎయిడ్స్ కార్యక్రమాలకు రూ.34వేల కోట్లు అందిస్తామని అమెరికా హామీ ఇచ్చిందని, ట్రంప్ అధ్యక్షుడు కాగానే ఈ ప్రతిపాదనను అటకెక్కించారని ఐరాస అధికార వర్గాలు తెలిపాయి. యుద్ధాలు, ప్రాంతీయ సైనిక ఘర్షణలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో మరిన్ని దేశాలు కూడా అమెరికా బాటలోనే పయనిస్తాయనే ఆందోళన తమకు ఉందని యూఎన్ ఎయిడ్స్ పేర్కొంది. అదే జరిగితే దశాబ్దాల తరబడి హెచ్‌ఐవీ ఎయిడ్స్ నియంత్రణకు తాము ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలకు అర్థం లేకుండా పోతుందని తెలిపింది. మళ్లీ అంతటా ఎయిడ్స్ మహమ్మారి భయాలు ముసురుకునే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలతో కలిసి తాము చేసిన కృషి వల్లే ఎయిడ్స్ మరణాలు గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి తగ్గాయని యూఎన్ ఎయిడ్స్ గుర్తు చేసింది. ఎన్నో పేద దేశాల్లో ఎయిడ్స్ రోగులకు ఔషధాలు, చికిత్సా సదుపాయాలను తాము అందిస్తున్నట్టు పేర్కొంది.
కొత్త ఇన్ఫెక్షన్లలో సగం
సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లోనే
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ కేసుల్లో దాదాపు సగం సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లోనే బయటపడుతు న్నాయని యూఎన్ ఎయిడ్స్ తెలిపింది. పలు ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఎంతోమంది ఎయిడ్స్ రోగులకు సరైన చికిత్స లభించడం లేదని చెప్పింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు సంభవించాయని అంచనా వేసింది. 2022 సంవత్సరం నుంచి ఇంతేస్థాయిలో ఎయిడ్స్ మరణాలు చోటుచేసు కుంటున్నాయని ఐరాస వర్గాలు అంటున్నాయి. చివరిసారిగా 2004లో అత్యధికంగా 20 లక్షల మందికిపైగా ఎయిడ్స్‌తో ప్రాణాలు వదిలారు.రి
జార్జ్ బుష్ హయాంలో ..
‘యూఎన్ ఎయిడ్స్’ కార్యక్రమాలకు అమెరికా ఆర్థిక మద్దతు 2003సంవత్సరంలో మొదలైంది. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రభుత్వం ‘ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్’ ను ప్రకటించింది. దాని ద్వారా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ చర్యల కోసం భారీగా నిధులను వెచ్చించే దేశంగా అమెరికా అవతరించింది. ఈ కార్యక్రమం పేద దేశాల్లోని ఎయిడ్స్ రోగులకు ఉపయోగకరంగా మారింది. మచ్చుకు పరిశీలిస్తే ఆఫ్రికా దేశం నైజీరియాలో యూఎన్ ఎయిడ్స్ చేపట్టిన హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల ఖర్చులో 99.9 శాతాన్ని అమెరికానే భరించింది. అమెరికా నిధుల దన్నుతోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 8.4 కోట్ల మందికి ‘యూఎన్ ఎయిడ్స్’ హెచ్‌ఐవీ పరీక్షలు చేయించింది. 2.6 కోట్ల మందికి ఎయిడ్స్ చికిత్స చేయించింది. ఎంతో ప్రాధాన్యత ఉన్న పథకాలను ట్రంప్ అడ్డుకోవటంతో..అంతర్జాతీయ సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది.