నవతెలంగాణ-హైదరాబాద్: లోక్ సభలో విపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండాలి అని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోక్ సభలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సభలో నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను.. రక్షణ మంత్రి, ఇతరులు మాట్లాడతారు.. కానీ, విపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వలేదు అని మండిపడ్డారు.
ఆపరేషన్ సిందూర్పై చర్చకు సిద్ధమా అని ఎంపీ ప్రియాంక గాంధీ సవాల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పై చర్చకు సిద్ధంగా ఉంటే, సభలో మాట్లాడటానికి మాకెందుకు అవకాశం ఇవ్వలేదు అని ప్రశ్నించింది. విపక్ష నేతగా రాహుల్కు అవకాశం ఇచ్చి ఉండాల్సింది అని పేర్కొనింది. చర్చ జరపడానికి సిద్ధంగా ఉంటే విపక్షాల గొంతు ఎందుకు నొక్కుతున్నారని ప్రియాంక గాంధీ అడిగింది.
ఇవాళ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా లోక్ సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అలాగే, వాయిదా తీర్మానాలపై చర్చించాలని కోరారు. దానికి స్పీకర్ ఒప్పకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు లోక్ సభలో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో రెండుసార్లు లోక్ సభ వాయిదా పడింది.